హైదరాబాద్ మీర్‌పేట్‌లో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్ మీర్‌పేట్‌లో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగోలుకు చెందిన శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్‌కు చెందిన సుమారు 150 మంది గణేష్ విగ్రహ నిమజ్జనం, దర్శనం కోసం మూడు బస్సుల్లో శ్రీశైలానికి బయలుదేరారు. 

రాత్రి సుమారు 2 గంటల సమయంలో గాయత్రి నగర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు బస్సుల్లో డీజిల్ పోస్తుండగా.. ప్రధాన రహదారిపై నిలిపి ఉన్న TS 15 T 8558 నంబర్ శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సులో కుడివైపు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. 

మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు దిగి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో.. అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు