
కర్నూలు ఆటో నగర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆటోనగర్ లోని ఓ గ్యారేజ్ సెంటర్ లో ఆయిల్ క్యాన్ల వల్ల మంటలు చెలరేగాయి. మంటలు గ్యారేజిలోని కార్లకు కూడా అంటుకోడంతో 5 కార్లు మంటల్లో కాలిపోయాయి. ఆ సమయంలో అక్కడ వాచ్ మెన్లు ఎవరూ లేకపోవడంతో.. చుట్టుపక్కల వారు చూసేలోపే మంటలు పక్కనున్న దుకాణాలకూ విస్తరించాయి. ఈ ఘటన గురించి సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు గ్యారేజీ చుట్టు పక్కల వ్యాపించడంతో అదుపు చేయడం కాస్త కష్టమైంది. జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ స్వయంగా దగ్గర ఉండి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.