మంటల్లో హైదరాబాద్ లోని అపార్ట్ మెంట్.. పలువురు సజీవదహనం

మంటల్లో హైదరాబాద్ లోని అపార్ట్ మెంట్.. పలువురు సజీవదహనం

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న నాంపల్లి ఏరియాలోని ఓ అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. 2023, నవంబర్ 13వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అపార్ట్ మెంట్ కింద ఉన్న కెమికల్ గోదాంలో మొదటగా మంటలు వచ్చాయి. రసాయనాలు కావటంతో.. మంటలు వేగంగా వ్యాపించాయి. నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ మొత్తాన్ని మంటలు చుట్టుముట్టాయి. దీంతో ఆయా ప్లాట్లలో ఉన్న వారు.. కిందకు రాలేక ఫైర్ సిబ్బంది సాయంతో.. నిచ్చెనల ద్వారా బయటకు వచ్చారు.

ఈ మంటలకు అపార్ట్ మెంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్న బైక్స్, కార్లు తగలబ్డాయి. అపార్ట్ మెంట్ బయటకు ఉన్న వాహనాలు సైతం మంటల్లో కాలి బూడిదయ్యాయి. కెమికల్స్ పెద్ద ఎత్తున నిల్వ ఉండటంతో.. మంటలను ఆర్పటం కష్టంగా మారింది. 

అపార్ట్ మెంట్ లోని ప్రమాదంతో.. పెద్ద ఎత్తున పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో ప్రమాదం జరిగిన బిల్డింగ్ పక్కన ఉన్న ఇళ్ల వారిని ఖాళీ చేయించారు అధికారులు. మంటలను అదుపు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు చెప్పిన అధికారులు.. ఇంకా ఎంత మంది చనిపోయారు.. గాయపడ్డారు అనేది విచారణ చేస్తున్నారు.