నిలోఫర్ ఆస్పత్రి ల్యాబ్​లో అగ్ని ప్రమాదం

నిలోఫర్ ఆస్పత్రి ల్యాబ్​లో అగ్ని ప్రమాదం
  • భయాందోళనకు గురైన చిన్నారులు, తల్లిదండ్రులు

మెహిదీపట్నం, వెలుగు:  నిలోఫర్‌‌ ఆస్పత్రిలో  బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది.  హాస్పిటల్  మొదటి అంతస్తులోని ల్యాబ్ లో  మంటలు చెలరేగడంతో  పొగ అలుముకుంది. దీంతో  ఆస్పత్రిలోని చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ఆస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.  ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాక సిబ్బంది ఫైరింజన్​తో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.  ప్రమాదంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారాణి స్పందిస్తూ.. ల్యాబ్​లో ఉన్న ఫ్రిజ్​లో సాయంత్రం 4 గంటలకు షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయన్నారు. ప్రిజ్​కు దగ్గరలో ఉన్న రబ్బర్ వస్తువులకు, కంప్యూటర్, ప్రింటర్​కు నిప్పంటుకొని పొగ వ్యాపించిందన్నారు. పేషెంట్స్, అటెండర్స్ కొంత భయాందోళనకు గురైనట్లు ఆమె తెలిపారు.  ప్రమాదంలో ఎవరికీ ఏం జరగలేదన్నారు. సిబ్బంది ఫైర్ సేఫ్టీ లో ట్రైనింగ్ పొంది ఉండటంతో వెంటనే ఆర్పివేశారని ఆమె చెప్పారు.  గ్రౌండ్ ఫ్లోర్​లో ఉన్న పేషెంట్లను వేరే వార్డుకి తరలించారని ఉషారాణి వెల్లడించారు. ఘటనాస్థలానికి నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వెళ్లారు. నాంపల్లి సెగ్మెంట్​లో ఫైర్ స్టేషన్​ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.