సిగరెట్ కారణంగానే నుమాయిష్ అగ్నిప్రమాదం: ఈటల

సిగరెట్ కారణంగానే నుమాయిష్ అగ్నిప్రమాదం: ఈటల

 హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామన్నారు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఈటల అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఓ షాపు  దగ్గర కాల్చిపారేసిన సిగరెట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఫైర్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని… వెంటనే స్పందించి మంటలార్పే ప్రయత్నం చేశారన్నారు. అగ్నిప్రమాదం జరిగిన టైంలో ఫైరింజన్ లో వాటర్ లేదనేది పుకారు మాత్రమే.. అందులో నిజం లేదన్నారు. ఫైరింజన్ కూడా కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉందన్నారు.

గురు, శుక్రవారాలు నుమాయిష్ బంద్

ఇవాళ, రేపు నుమాయిష్ ను తాత్కాలికంగా నిలిపేస్తున్నామని చెప్పారు. అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్ ను మరిన్ని రోజులు పెంచుతామన్నారు. నుమాయిష్ లో నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని… ప్రమాదంపై పాలక వర్గంతో చర్చించామని తెలిపారు. నష్టపరిహారాన్ని రెవెన్యూ యంత్రాంగం అంచనా వేస్తోందన్నారు. రిపోర్టు ఆధారంగానే బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. నష్టపోయిన వారిలో 130 మంది ఓనర్లున్నారని తెలిపారు.

ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రైవేట్ సంస్థ కాదు.. వ్యాపార సంస్థ కాదు.. పేద ప్రజల కోసం పని చేస్తోందన్నారు. సొసైటీ ద్వారా వచ్చే లాభాలను పేద ప్రజలు, విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు ఇన్సూరెన్స్ చేయించుకుంటే సొసైటీ నుంచి రాయితీ ఇప్పిస్తామన్నారు. అగ్నిప్రమాద ఘటన వివరాలను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు ఈటల రాజేందర్.