ముషీరాబాద్, వెలుగు: వరుస అగ్ని ప్రమాదాలతో ముషీరాబాద్పరిధిలోని భోలక్పూర్ ఉలిక్కి పడుతూనే ఉంది. ఇటీవల ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో, ఆ తర్వాత టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరగగా, తాజాగా బుధవారం రాత్రి మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భోలక్పూర్ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం పక్కన అర్జున్ అనే వ్యక్తి ‘శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్’ పేరుతో సెంట్రింగ్ షాప్ నిర్వహిస్తున్నారు.
బుధవారం రాత్రి పూజ నిమిత్తం వెలిగించిన దీపం వల్లనో, లేదా షార్ట్ సర్క్యూట్ వల్లనో షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి 11:30 గంటల సమయంలో దుకాణం లోపల నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించి.. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో దుకాణంలోని సామగ్రి కొంతమేర కాలిపోయిందని, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటనేది దర్యాప్తులో తేలుస్తామని, దీనిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
