ముంబైలో భారీ అగ్నిప్రమాదం..భయభ్రాంతులకు గురైన ప్రజలు

ముంబైలో భారీ అగ్నిప్రమాదం..భయభ్రాంతులకు గురైన ప్రజలు

మహారాష్ట్ర ముంబైలోని ఓ భారీ అపార్ట్ మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.  లోయర్ పరేల్ ప్రాంతంలోని అవిగ్నాన్ పార్క్ భవనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 22వ ఫ్లోర్ లో ఉదయం 10:45 గంటలకు  మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో అవిగ్నాన్ పార్క్ భవనంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.   

అగ్ని ప్రమాదం కారణంగా అవిగ్నాన్ పార్క్ భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించారు.  అపార్ట్ మెంట్లో నివసిస్తున్న వారిని కిందకు దించారు. ముందు జాగ్రత్త చర్యగా ఘటనా స్థలంలో అంబులెన్స్ ను కూడా ఉంచారు. మరోవైపు అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే దట్టమైన పొగ వల్ల చుట్టు ప్రక్కల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేవు. అయితే అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ప్రమాదానికి గల కారణాలపై  అన్వేషిస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ సమయంలో అంతస్తులో ఎంత మంది ఉన్నారు. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అని దర్యాప్తు చేస్తున్నారు.