సిరిసిల్ల సెస్ ఆఫీసులోఅగ్ని ప్రమాదం .. పటాకులు కాల్చుతుండగాఫస్ట్ ఫ్లోర్​లో మంటలు 

సిరిసిల్ల సెస్ ఆఫీసులోఅగ్ని ప్రమాదం .. పటాకులు కాల్చుతుండగాఫస్ట్ ఫ్లోర్​లో మంటలు 
  • విలువైన డాక్యుమెంట్లు,మూడు కంప్యూటర్లు దగ్ధం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆఫీసులో లక్ష్మి పూజ నిర్వహించారు. తర్వాత పటాకులు కాల్చారు. అయితే కొద్దిసేపటికే బిల్డింగ్​ఫస్ట్ ఫ్లోర్ లోని రికార్డుల గదిలో మంటలు చెలరేగాయి. అక్కడి డాక్యుమెంట్లు సహా మూడు కంప్యూటర్లు పూర్తిగా కాలిపోయాయి.15 సంవత్సరాల డేటాకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.

పటాకులు కాల్చిన 15 నిమిషాల తర్వాత మంటలు ఎగిసిపడడంతో ఫైర్ స్టేషన్​కు సమాచారం ఇచ్చామని సెస్​సిబ్బంది తెలిపారు. అయితే అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంపై సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, కొంత మంది డైరెక్టర్లు సోమవారం సిరిసిల్ల టౌన్ సీఐ ఉపేందర్ కు ఫిర్యాదు చేశారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని అందులో పేర్కొన్నారు. కేసు ఫైల్​చేసి, విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు.

ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సెస్​చైర్మన్​రామారావు తెలిపారు. ప్రమాదంలో టెక్నికల్ అండ్​పర్చేజ్ సెక్షన్​రూమ్​పూర్తిగా దగ్ధమైందని సెస్ ఎండీ సూర్యచంద్రరావు తెలిపారు. ఆ రూమ్​లోని మూడు కంప్యూటర్లతోపాటు, 15 ఏండ్లుగా నమోదు చేస్తున్న పర్చేజ్ ఫైల్స్ కాలి బూడిదయ్యాయన్నారు. కొన్ని ఫైల్స్​జిరాక్స్​కాపీలు వేరే గదిలో భద్రపరిచామని, పర్చేజింగ్​కు సంబంధించిన ఫైల్స్​పూర్తిగాకాలిపోయాయన్నారు. 

ప్రమాదంపై అనుమానాలు

సెస్​బిల్డింగులో అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా అనే చర్చ నడుస్తోంది. సెస్ పై ఉన్న అవినీతి ఆరోపణలే ఇందుకు కారణం. దీపావళి సందర్భంగా సెస్ ఆఫీసులో పూజలు చైర్మన్, వైస్ చైర్మన్లు కాకుండా, ఓ డైరెక్టర్ చేతుల మీదుగా ఎందుకు జరిపించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెస్​లో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న సిరిసిల్లకు చెందిన వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

సీనియర్ జేఓగా పనిచేస్తున్న రాజేందర్ ను ట్రాన్స్​ఫర్ చేసినప్పటికీ మళ్లీ ఆయనను సెస్ ఎండీకి అటాచ్​చేశారు. సెస్ ను ప్రక్షాళన చేస్తానని పదేపదే చెప్పిన చైర్మన్ రామారావు.. రాజేందర్​ను ఎందుకు సెస్ లోనే ఉంచారని చర్చించుకుంటున్నారు. దీపావళి సందర్భంగా రాజేందర్ కింద పటాకులు కాల్చితే, పై గదిలోకి ఎలా వెళ్లాయని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు సెస్​లో ఆడిట్​జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఫైళ్లన్నీ తగలబడడం అనుమానాలకు తావిస్తోంది.