- ఓ బోగీ పూర్తిగా దగ్ధం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘటన
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న ప్యాంట్రీ కార్ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన ఫైర్‌సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. దాన్ని ఆనుకుని ఉన్న మరో బోగీ పాక్షికంగా తగలబడింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం రెండు ఏసీ ప్యాంట్రీ కార్ బోగీలను వాషింగ్కోసం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్నుంచి మెట్టుగూడ వద్ద ఉన్న క్లీనింగ్ పిట్యార్డుకు తీసుకెళ్లారు.
క్లీనింగ్ పూర్తయ్యాక 11 గంటల ప్రాంతంలో బోగీలను తిరిగి స్టేషన్ కు తరలిస్తుండగా, ఓ ప్యాంట్రీ కార్బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ఏరియాను దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. రైల్వే సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సకాలంలో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.
మంటలు చెలరేగిన బోగీ పూర్తిగా దగ్ధమైంది. దాన్ని ఆనుకుని ఉన్న మరో బోగీ స్వల్పంగా దెబ్బతింది. ఆ సమయంలో బోగీల్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ పరిశీలించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కాగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రతి సూపర్ఫాస్ట్ఎక్స్ప్రెస్కు ప్యాంట్రీ కార్‌కోచ్‌లు అటాచ్ అయి ఉంటాయి. అందులో ప్రయాణికులకు అవసరమైన భోజనాలు, టిఫిన్లు, ఇతర ఆహార పదార్ధాలు తయారుచేస్తారు. ఈ ప్యాంట్రీ కార్ కోచ్‌లలో కుకింగ్కు పూర్తిగా కరెంటును వినియోగిస్తున్నారు. గురువారం బోగీలను నీటితో కడుగుతున్న సమయంలో షార్ట్సర్క్యూట్జరిగి, మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.
