నల్గొండ జిల్లాలో వరికొయ్యలకు నిప్పు.. 200 ఎకరాల్లో మంటలు... 

నల్గొండ జిల్లాలో వరికొయ్యలకు నిప్పు.. 200 ఎకరాల్లో మంటలు... 

నల్గొండ, వెలుగు : వరికొయ్యలకు పెట్టిన నిప్పు అంటుకొని సుమారు 200 ఎకరాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని గిరకబావి గూడెంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ పొలాల్లోని వరికొయ్యలను కాల్చేందుకు నిప్పు పెట్టారు. ఆ నిప్పు కాస్తా పక్క పొలాలకు అంటుకోవడంతో సుమారు 200 ఎకరాల్లో మంటలు చెలరేగాయి. 

గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘటనా స్థలానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. వరికొయ్యలను కాల్చడం వల్ల భూమి సారం కోల్పోయి పంట దిగుబడి తగ్గిపోతుందన్నారు. అలాగే వాతావరణం కాలుష్యంతో పాటు వాహనదారులకు సైతం ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. 

రైతులు వరికొయ్యలను తగలబెట్టకుండా ఉండేందుకు అగ్రికల్చర్‌ ఆఫీసర్లతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ మాట్లాడుతూ... వరి కొయ్యలు తగలబెట్టడం వల్ల ప్రమాదాల జరిగితే... బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వారి వెంట అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ శ్రవణ్ ఉన్నారు.