కారులో మంటలు.. కంటోన్మెంట్ బోర్డు ఆఫీసు వద్ద ఘటన

కారులో మంటలు.. కంటోన్మెంట్ బోర్డు ఆఫీసు వద్ద ఘటన

సికింద్రాబాద్, వెలుగు :  నడుస్తున్న కారు ఇంజన్​లోంచి మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైన సంఘటన సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్​బోర్డు ఆఫీసు సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. బోయిన్​పల్లిలో ఉండే ఓ వ్యక్తి తన స్విఫ్ట్ డిజైర్​కారు రేడియేటర్​చెడిపోగా బర్కత్ పురాలో రిపేర్​చేయించుకుని బోయిన్​పల్లికి వెళ్తున్నాడు. రాత్రి 7 గంటల సమయంలో  సికింద్రాబాద్​వైఎంసీఏ వద్దకు రాగా కారు ఇంజన్​లో నుంచి పొగలు వస్తున్నాయి. వాహనదారులు చూసి కారు నడుపుతున్న వ్యక్తికి చెప్పారు.

వెంటనే ఆయన యూ-టర్న్​ తీసుకుని కంటోన్మెంట్​బోర్డు ఆఫీసు ఎదురుగా ఆపేలోపే కారు ఇంజన్​నుంచి పెద్ద ఎత్తున మంటలు లేవడగా వెంటనే ఆయన దిగిపోయాడు. అప్పటికే కారు ముందు భాగం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి మొత్తం వ్యాపించాయి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఫైర్​సిబ్బందికి సమాచారం అందించగా వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే కారు పూర్తిగా దగ్దమైంది. కారులో తన సెల్​ఫోన్, కొంత డబ్బు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు ఓనర్ చెప్పాడు. అయితే తన పేరు చెప్పేందుకు బాధితుడు ఇష్టపడలేదు.