హైదరాబాద్, వెలుగు: అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ శాఖ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వర్క్‌షాప్ నిర్వహించారు. ‘ఫైర్ ఎన్‌వోసీలు, జీ1, జీ2, జీ3 బిల్డింగ్స్‌లో ప్రమాదాల నివారణకు నూతన సాంకేతిక పరిజ్ఞానం’ అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్ మాన్‌తో పాటు పరిశ్రమల ప్రతినిధులు, ఆర్కిటెక్ట్‌లు, ఫైర్ సేఫ్టీ కన్సల్టెంట్లు, సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, నిపుణులు పాల్గొన్నారు.
అగ్నిప్రమాదాల నివారణ, ఫైర్ సేఫ్టీ, ప్రాణనష్టం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పరిశ్రమలకు అవసరమైన ప్రొవిజనల్ ఎన్‌వోసీ, ఆక్యుపెన్సీ ఎన్‌వోసీ, రెన్యూవల్ ప్రక్రియలను సరళీకృతం చేసి ప్రమాణీకరించడంపై చర్చ జరిగింది. పరిశ్రమల కేటగిరీల వారీగా స్పష్టమైన ఫైర్, లైఫ్ సేఫ్టీ చెక్‌లిస్టులు రూపొందించడం, వర్తించని నిబంధనలను తొలగించడం, కనీస భద్రతా ప్రమాణాలను నిర్దేశించడంపై అభిప్రాయాలు పంచుకున్నారు.
