నెల రోజులే టైమ్..ఈలోగా ఫైర్ సేఫ్టీ సెట్ చేసుకోవాలి

నెల రోజులే టైమ్..ఈలోగా ఫైర్ సేఫ్టీ సెట్ చేసుకోవాలి
  •     నిబంధనలు పాటించని షాపులకు హైడ్రా గడువు
  •     ఆ తర్వాత కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరిక

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపులను సీజ్ చేసే కార్యక్రమానికి నెల రోజుల బ్రేక్ ఇస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది. ఈ గడువులోగా అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా షాపులు, వ్యాపార సముదాయాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. నెల తర్వాత తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

శనివారం హైడ్రా ఆఫీసులో షాపుల యజమానులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, జీహెచ్‌‌‌‌ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను వివరించారు. నెల రోజుల గడువు కావాలన్న వ్యాపార సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని పేర్కొన్న 9 షాపుల యజమానుల నుంచి అఫిడవిట్లు తీసుకుని వ్యాపారాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.

నెలరోజుల పాటు అవేర్నెస్

నెల రోజుల పాటు పాతబస్తీ, బేగంబజార్, ట్రూప్ బజార్, మదీనా సెంటర్ వంటి ముఖ్య వ్యాపార ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. హైడ్రా, జీహెచ్‌‌‌‌ఎంసీ, ఫైర్ విభాగాలతో కలిసి ఫైర్ సేఫ్టీ నిబంధనలు రూపొందిస్తున్నామని, కరపత్రాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. 

వ్యాపార సముదాయాలు, దుకాణాలు ఉన్న చోట సమావేశాలు ఏర్పాటు చేసి ఫైర్ సేఫ్టీ చర్యలపై అవగాహన కల్పిస్తామన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే బయటకు వచ్చేలా కారిడార్లు, మెట్ల దారులు స్పష్టంగా ఉండాలని, మండే స్వభావం ఉన్న వస్తువుల నిల్వలు ఎక్కువగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.