పిల్లలకి నేర్పించాల్సిన ఫస్ట్ ఎయిడ్​ బేసిక్స్​​ ఏంటంటే.? 

పిల్లలకి నేర్పించాల్సిన ఫస్ట్ ఎయిడ్​ బేసిక్స్​​ ఏంటంటే.? 

పదేండ్ల ఆశిష్​ టీవీ చూస్తున్నాడు. ఆ పక్కనే మూడేండ్ల తమ్ముడు అయాన్​ ఆడుకుంటూ రూపాయి బిళ్ల మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఉక్కిరిబిక్కిరి అయింది ఆ చిన్నారికి.. ఒళ్లు ఊదా రంగులోకి మారిపోయింది. విపరీతంగా దగ్గు వస్తోంది. అది గమనించిన అయాన్​ వెంటనే తమ్ముడ్ని కాళ్లపై బోర్లా పడుకోబెట్టుకున్నాడు. వెనక భాగంలో గట్టిగా నాలుగుసార్లు కొట్టి, ఆ బిళ్లని బయటకు తీశాడు. దీనికి కారణం స్కూల్​లో నేర్చుకున్న ఫస్ట్​ ఎయిడ్ స్కిల్స్​​. పిల్లలు కచ్చితంగా నేర్చుకోవాల్సిన లైఫ్​ స్కిల్స్​​ ఇవి. 

ప్రతి క్షణం పిల్లల్ని కనిపెట్టుకొని ఉండటం తల్లిదండ్రులకి సాధ్యం కాదు. అందుకే పేరెంట్స్​ చుట్టుపక్కల లేనప్పుడు.. ఎవర్ని వాళ్లు, అలాగే చుట్టూ ఉన్నవాళ్లని ఎలా ప్రొటెక్ట్​ చేసుకోవాలో పిల్లలకి ముందు నుంచే నేర్పించాలి. ఈ బేసిక్​ నాలెడ్జ్​ వాళ్లని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడుతుంది. పిల్లలకి నేర్పించాల్సిన ఫస్ట్ ఎయిడ్​ బేసిక్స్​​ ఏంటంటే....? 

ఎమర్జెన్సీ సర్వీస్​ 
నేషనల్​ ఎమర్జెన్సీ నెంబర్​ 112 పై పిల్లలకి అవేర్​నెస్​ కల్పించాలి. ఈ నెంబర్​ని వాళ్లు గుర్తు పెట్టుకునేలా చేయాలి. అలాగే అత్యవసర పరిస్థితిని 112 ఆపరేటర్​కి ఎలా వివరించాలన్నది .. డెమో రూపంలో చూపించాలి. లాక్​ బటన్​ని మూడుసార్లు నొక్కినా, 112 కి ఫోన్​ వెళ్తుందన్న విషయం కూడా వాళ్లకి చెప్పాలి. అలాగే డయల్​ 100పైనా అవగాహన పెంచాలి. అయితే ఈ నెంబర్ల​కి కేవలం ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే ఫోన్​ చేయాలన్నది వాళ్లకి అర్థమయ్యేలా  చెప్పాలి.  ఇంట్లో వాళ్ల ఫోన్​ నెంబర్లు​, ఇంటి అడ్రస్​​ కూడా  గుర్తుంచుకునేలా చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్​దే. 

సాయం అడగమనాలి  
పిల్లలకి ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలన్నది పేరెంట్స్​ చెప్పాలి.  ఉదాహరణకి ఇంట్లో తమ్ముడు లేదా చెల్లికి గాయం అయినప్పుడు.. ఐస్​ పెట్టడం లేదా పసుపు రాయడం లాంటివి చేయమనాలి. ఇంట్లోని అమ్మమ్మ లేదా తాతయ్య కళ్లు తిరిగి పడిపోతే.. వెంటనే  ఇంట్లో లేదా చుట్టుపక్కల ఉన్నవాళ్లని సాయం అడగమనాలి. అలాగే ఇంట్లోని పెద్దవాళ్ల హెల్త్​ కండీషన్స్​ గురించి పిల్లలతో మాట్లాడాలి. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా.. దాని గురించి వాళ్లకి అవగాహన కల్పించాలి. 

ఫస్ట్​ ఎయిడ్​ కిట్
పిల్లలతో కలిసి ఫస్ట్​ ఎయిడ్​ కిట్​ ప్రిపేర్​ చేయాలి పేరెంట్స్​. బ్యాండేజ్, ఆయింట్​​మెంట్, యాంటీ సెప్టిక్​ మందులు, దూది ఇలా అన్నీ వాళ్లతోనే కిట్​లో పెట్టిస్తూ..వాటిని ఎప్పుడు, ఎలా వాడాలో చెప్పాలి. అలాగే వాటిని ఎందుకు వాడుతున్నారు.. అవి ఎలా మనల్ని కాపాడతాయో కూడా చెప్పాలి. ఉదాహరణకి గాయాలపై యాంటీ సెప్టిక్​ లిక్విడ్​  రాస్తే దానిపై ఉండే చెడు బ్యాక్టీరియా చనిపోతుందని చెప్పాలి. అలాగే తలకి లేదా చేతులకి  గాయం అయి రక్తం కారుతుంటే.. వెంటనే టవల్​ లేదా కర్చీఫ్​ని గాయంపై గట్టిగా అదిమి పెట్టాలని చెప్పాలి. 

అబ్జర్వేషన్​  
పిల్లలకి రైట్​, ​ రాంగ్​​ సిగ్నల్స్​ గురించి చెప్పాలి. అంటే.. ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయం వాళ్లకి తెలిసేలా చేయాలి. కొత్త ప్రాంతాలకి వెళ్లినప్పుడు, కొత్త మనుషుల మధ్య ఉన్నప్పుడు.. చుట్టూ ఉన్న పరిసరాల్ని అబ్జర్వ్​ చేయమనాలి.  అలాగే పరిస్థితి ఏదైనా సరే  కంగారు పడకుండా మైండ్​ని అలర్ట్​గా ఎలా ఉంచాలో నేర్పించాలి. 

మంటల్లో చిక్కుకుంటే 
చుట్టు పక్కల  మంటలు అల్లుకుంటే.. స్టాప్​, డ్రాప్, అండ్  రోల్​ టెక్నిక్​ ఫాలో అవ్వమనాలి. అంటే మంటలు అంటుకున్నప్పుడు పారిపోకుండా  ఆగి,  నేల మీద పడుకొని అటుఇటు పొర్లమనాలి. అలాగే ఆటలు ఆడేటప్పుడు కాళ్లు, చేతులు బెణకడం లాంటివి జరిగితే  తీసుకోవాల్సిన  జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలి.