
హైదరాబాద్, వెలుగు:టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్, సెకండ్ ప్రయార్టీ ఓట్లు కీలకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లోనూ ఇవే విజేతను నిర్ణయించాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండే అవకాశముందని టీచర్ల సంఘాలు భావిస్తున్నాయి. అలాగే చివరి వరకూ పోటీలో ఉండాలంటే, ఈ రెండే కీలకం కావడంతో, అందరి దృష్టి వీటిపై ఉంది. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫస్ట్ ప్రయార్టీ ఓట్లను అడుగుతూనే, అది కుదరకపోతే సెకండ్ ప్రయార్టీ ఓటైనా వేయాలని టీచర్లను రిక్వెస్ట్ చేస్తున్నారు.
మొత్తం ఓట్లు 29,700
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సెగ్మెంట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక అన్ని పార్టీలు, టీచర్ల సంఘాలకు కీలకంగా మారింది. జనరల్ ఎన్నికలకు ముందుగా జరగుతుండటంతో అందరి దృష్టి పడింది. ఈ నెల13న పోలింగ్ జరగనుండగా,16న కౌంటింగ్ ఉంటుంది. ఈ సెగ్మెంట్లో 29,700లకు పైగా టీచర్ ఓట్లున్నాయి. వీటిలో సుమారు 16వేలకు పైగా ఓట్లు సర్కారు స్కూల్ టీచర్ల ఓట్లుండగా, ప్రైవేటు విద్యాసంస్థల్లోనివి మరో 4వేల వరకు ఉన్నట్టు టీచర్ల సంఘాల నేతలు చెప్తున్నారు. జూనియర్ కాలేజీలవీ 1200 వరకూ, కేజీబీవీల్లో మరో 900లకు పైగా ఉన్నాయని పేర్కొంటున్నారు. సుమారు 27 రకాల మేనేజ్మెంట్లకు చెందిన ఓటర్లు ఈ ఎన్నికల్లో ఉన్నారు. వీరిలో సర్కారు టీచర్లు ఎక్కువ ఉండగా.. అందరి దృష్టి వారిని ప్రసన్నం చేసుకోవడంపై ఉంది.
ఓటు ప్రయార్టీలపై సంఘాల ఒప్పందాలు
ఈ ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ప్రధానంగా 8 మంది మధ్యనే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తంగా నలుగురు అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఒక ఓటరు 21 మంది అభ్యర్థులకు ప్రయార్టీ ఓట్లు వేసే చాన్స్ఉంది. అయితే, కౌంటింగ్ చివర వరకు పోటీలో ఉండాలంటే ఫస్ట్, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు కీలకం. దీంతో కొందరు అభ్యర్థుల మధ్య సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లను మార్చుకునే ఒప్పందాలు జరిగాయి. అంటే, ఒక సంఘం అభ్యర్థికి ఫస్ట్ ప్రయార్టీ ఓటు వేస్తే.. ఒప్పందం కుదుర్చుకున్న సంఘం అభ్యర్థికి రెండో ప్రయార్టీ ఓటు వేయనున్నారు. ఇది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే చాన్స్ ఉంది.
2017లో ఏం జరిగిందంటే..
గత ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీ చేయగా మొత్తం 19,338 ఓట్లు పడ్డాయి. వీటిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో అభ్యర్థులు కాటేపల్లి జనార్దన్ రెడ్డికి 7640 ఓట్లు రాగా, ఏవీఎన్ రెడ్డికి 3091 ఓట్లు, మాణిక్ రెడ్డికి 3048 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ ప్రయార్టీ ఓట్లతో ఫలితం రాకపోవడంతో, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో మాణిక్ రెడ్డికి ఎక్కువ ఓట్లు రావడంతో ఆయన రెండోస్థానంలోకి వచ్చారు. ఈక్రమంలో ఏవీఎన్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత జనార్దన్ రెడ్డికి 9734 ఓట్లు రాగా, మాణిక్ రెడ్డికి 5095 ఓట్లు వచ్చాయి. అప్పుడు పీఆర్టీయూ నుంచి పోటీ చేసిన జనార్దన్ రెడ్డి..ప్రస్తుతం పీఆర్టీయూటీ నుంచి పోటీ చేస్తున్నారు. పీఆర్టీయూ చెన్నకేశవరెడ్డిని పోటీలో దింపింది. యూటీఎఫ్ తరఫున మాణిక్ రెడ్డి రెండోసారి బరిలో నిలిచారు. ఈ క్రమంలో పీఆర్టీయూ ఓట్ల చీలికపై గెలుపోటములు ఉంటాయనీ టీచర్ల సంఘాల నేతలు చెప్తున్నారు.