ప్లాస్మా థెరపీ సక్సెస్..ఢిల్లీలో కోలుకున్న49 ఏళ్ల పేషెంట్

ప్లాస్మా థెరపీ సక్సెస్..ఢిల్లీలో కోలుకున్న49 ఏళ్ల పేషెంట్
  • ప్లాస్మా ఎక్కించక ముందుకండిషన్ సీరియస్
  • ట్రీట్ మెంట్ తర్వాత టెస్టుల్లో నెగెటివ్
  • ప్లాస్మా థెరపీ 100% పని చేస్తదని చెప్పలేం కానీ..
  • సీరియస్ పేషెంట్లకు మేలంటున్న డాక్టర్లు
  • దేశంలో కరోనా పేషెంట్ కు ప్లాస్మా థెరపీ ఇదే తొలిసారి

న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా కరోనా పేషెంట్ కు ఢిల్లీ డాక్టర్లు ప్లాస్మా థెరపీతో సక్సెస్​ఫుల్​గా  ట్రీట్ మెంట్ చేశారు. వైరస్ వల్ల తీవ్ర న్యుమోనియా వచ్చి, సీరియస్ కండీషన్ లోకి వెళ్లిన ఓ 49 ఏళ్ల పేషెంట్ కు ప్లాస్మాను ఎక్కించగా, 4 రోజుల్లోనే కోలుకున్నాడు. వెంటిలేటర్ పై ఉన్న అతడికి దాని అవసరం తప్పింది. ఇప్పుడు సొంతంగా ఆహారం కూడా తినగలుగుతున్నాడు. తాజా టెస్టులో అతడికి కరోనా నెగెటివ్ వచ్చిందని డాక్టర్లు సోమవారం వెల్లడించారు. కరోనా నుంచి ప్రాణాలను కాపాడటంలో కీలకంగా మారనున్న ఈ ట్రీట్ మెంట్ ప్రయోగాన్ని ఢిల్లీ సాకేత్ లోని మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్లు చేశారు.

ఇలా కోలుకున్నాడు

కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరిన ఆ పేషెంట్ కు ఏప్రిల్ 4న వైరస్ సోకినట్లు కన్ఫమ్ అయింది. కొన్ని రోజులకే న్యుమోనియా వచ్చింది. టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ సమస్య మొదలైంది. దీంతో సీరియస్ కండీషన్ లోకి వెళ్లిన అతడిని ఏప్రిల్ 8న వెంటిలేటర్ పై ఉంచారు. రోజురోజుకూ పరిస్థితి క్షీణించడంతో ప్లాస్మా థెరపీని ప్రయత్నించాలని కుటుంబ సభ్యులు డాక్టర్లను కోరారు. ఇప్పటివరకు దేశంలో ఎవరికీ చేయకున్నా ప్రయత్నిద్దామని డాక్టర్లు నిర్ణయించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను సేకరించారు. డోనర్​కు మరోసారి కరోనా టెస్టుతో పాటు హెపటైటిస్ బి, సి, హెచ్ఐవీ టెస్టులూ చేసి నెగెటివ్ తేలాకే ప్లాస్మా తీసుకున్నారు. ఏప్రిల్ 14న రాత్రి పేషెంట్​కు ఆ ప్లాస్మా ఎక్కించారు. ఆ తర్వాత 4 రోజులకు పేషెంట్ పరిస్థితి మెరుగుపడింది. తర్వాత వెంటిలేటర్​నూ తొలగించారు.  ఆక్సిజన్ అందిస్తూ వచ్చారు. ఆదివారం  వేరే రూంకు షిఫ్టు చేశారు. ఇప్పుడతను సొంతంగా తింటున్నాడని, అతడికి తాజాగా రెండు సార్లు టెస్టులు చేస్తే నెగెటివ్ వచ్చిందని డాక్టర్లు వెల్లడించారు.

ఇతర ట్రీట్ మెంట్లూ చేశారు

ప్లాస్మా థెరపీ సక్సెస్ కావడంపై హాస్పిటల్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజా సంతోషం వ్యక్తం చేశారు.  పేషెంట్ కోలుకునేందుకు ఇదొక్కటే వంద శాతం పనిచేసిందని చెప్పలేమని, ప్రొటోకాల్ ప్రకారం ఇతర అన్ని రకాల ట్రీట్ మెంట్లు తాము కొనసాగించామని చెప్పారు. సీరియస్ పేషెంట్లను కాపాడేందుకుఈ థెరపీ బాగా ఉపయోగపడొచ్చన్నారు.

ఒక్కరికి 200 మిల్లీలీటర్లు చాలు

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి 400 మిల్లీలీటర్ల ప్లాస్మా సేకరించొచ్చని డాక్టర్లు చెప్పారు. ఒక్కో పేషెంట్ కు 200 మిల్లీలీటర్ల ప్లాస్మా సరిపోతుందని,  ఒకరు డొనేట్ చేసే ప్లాస్మాతో ఇద్దరి ప్రాణాలు కాపాడొచ్చని తెలిపారు.

ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి?

రక్తంలో నీటి మాదిరిగా పసుపు రంగులో కనిపించే ద్రవమే ప్లాస్మా. ఇందులో దేహంలోకి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ లను చంపే యాంటీబాడీలుంటాయి. కరోనా సోకి కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాలో ఆ వైరస్ ను చంపే యాంటీబాడీలూ ఉంటాయి. కరోనా సోకిన వ్యక్తుల్లో వైరస్ కణాలను తెల్లరక్తకణాలు గుర్తించేందుకు రోగనిరోధక వ్యవస్థ ఈ యాంటీబాడీలను తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీలు వైరస్ కణాలకు అతుక్కున్న తర్వాత వాటిని తెల్లరక్తకణాలు గుర్తించి నాశనం చేస్తాయి. అందుకే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సీరియస్ పేషెంట్లకు ఎక్కిస్తారు