- గ్రేటర్‌లోని 31 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీల నిర్మాణం
- సిటీలో రోజుకు 1950 ఎంఎల్‌డీల మురుగు ఉత్పత్తి
- ఇందులో శుద్ధి చేస్తుంది 46 శాతమే
- మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే 100 శాతం సాధ్యం
- సీవేజ్ ట్రీట్మెంట్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్సిటీలోని చెరువులు బాగుండాలన్నా.. మూసీ ప్రక్షాళన జరగాలన్నా.. మురుగునీటిని 100 శాతం శుద్ధి చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులోనూ అందుకు అనుగుణంగా సన్నాహాలు చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే ఇందుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ పనులు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మురుగునీటి శుద్ధిపై స్పెషల్ఫోకస్పెట్టింది. అవసరమైన నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వాటర్‌బోర్డు అధికారులు ‘హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్‌ప్లాన్’ను రెడీ చేస్తున్నారు. సిటీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కొత్తగా ఎస్టీపీలు నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారు. గ్రేటర్‌పరిధిలో ప్రస్తుతం 46 శాతం మాత్రమే మురుగునీటి శుద్ధి జరుగుతోంది. మాస్టర్ ప్లాన్అమలు జరిగితే వంద శాతం మురుగునీటి శుద్ధి చేస్తున్న నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది.
54 శాతం జరగట్లే..
గ్రేటర్‌పరిధిలో ప్రస్తుతం డెయిలీ 1,950 ఎంఎల్‌డీల(మిలియన్ లీటర్స్ పర్ డే) మురుగు ఉత్పత్తి అవుతోంది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1,650 ఎంఎల్‌డీల, జీహెచ్ఎంసీ అవతల, ఓఆర్ఆర్ పరిధిలో 300 ఎంఎల్‌డీల మురుగు ఉత్పత్తి అవుతోంది. ఈ మొత్తాన్ని శుద్ధి చేసేందుకు సిటీలో 772 ఎంఎల్‌డీల కెపాసిటీ ఉన్న 25 ఎస్టీపీలు(సీవరేజ్ట్రీట్మెంట్ప్లాంట్లు) మాత్రమే ఉన్నాయి. వీటిలోని కొన్నింటిని వాటర్‌బోర్డు, కొన్నింటిని హెచ్ఎండీఏ నిర్వహిస్తున్నాయి. 25 ఎస్టీపీల పరిధిలో 46 శాతం మురుగునీరు మాత్రమే శుద్ధి జరుగుతోంది. ప్రస్తుతం రూపొందిస్తున్న మాస్టర్ప్లాన్అమలు జరిగితే వందశాతం జరిగే అవకాశం ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా కాకుండా, భవిష్యత్అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
వచ్చే పదేండ్లకు అనుగుణంగా..
సిటీలో మురుగునీటి ఉత్పత్తి, శుద్ధి తీరుపై ముంబైకి చెందిన షా టెక్నాలజీస్ సంస్థతో గత ప్రభుత్వం అధ్యయనం చేయించింది. 2036 నాటికి హైదరాబాద్‌లో 2,814 ఎంఎల్‌డీల, 2051 నాటికి 3,715 ఎంఎల్‌డీల మురుగు ఉత్పత్తి అవుతుందని ఆ సంస్థ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా వచ్చే పదేండ్ల అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 772 ఎంఎల్‌డీల కెపాసిటీతో నడుస్తున్న 25 ఎస్టీపీలకు అదనంగా, 1,259.5 ఎంఎల్‌డీల కెపాసిటీతో కొత్తగా రూ.3,866.21 కోట్లతో 31 ఎస్టీపీలు నిర్మిస్తామని చెప్పారు. వీటికి గత ప్రభుత్వమే ఆమోదం తెలిపింది. కొత్త సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణం ఎక్కడెక్కడ చేపట్టాలన్న దానిపై అధికారులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. చెరువులు, నాలాలు, మూసీ సమీపంలో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, తద్వారా నగరంలోని చెరువులను సంరక్షించడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే దేశంలో 100 శాతం సీవరేజ్ ట్రీట్‌మెంట్ చేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఎస్టీపీల నిర్మాణ పనులను పరిశీలన
వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి బుధవారం అత్తాపూర్, మీర్ఆలంలో నిర్మిస్తున్న ఎస్టీపీల పనులను పరిశీలించారు. హసన్ నగర్‌లోని ఐఅండ్ డీని సందర్శించారు. ముందుగా అత్తాపూర్ ఎస్టీపీకి వెళ్లిన ఆయన అక్కడ నిర్మాణ పనులు పరిశీలించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనివార్య కారణాలతో పనులు లేట్అయితే, ఇన్‌టైంలో పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మిరాలం ఎస్టీపీని సందర్శించారు. మీర్ఆలం చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సమీప కాలనీల నుంచి చెరువులోకి మురుగు చేరే పాయింట్లను గుర్తించారు. మురుగు రాకుండా చెరువు చుట్టూ ఉన్న పైపు లైన్లను, కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీలోకి మళ్లించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు. పని జరిగే ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎండీ వెంట ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్–-2, సీజీఎం సుదర్శన్, జీఎం, ఎస్టీపీల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.