
మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. వేఫేరల్ ఫిలిమ్స్ అనే బ్యానర్ స్థాపించి విభిన్నమైన కథా చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇటీవల ఆయన నిర్మించిన చిత్రం ' లోకా: చాప్టర్ 1 - చంద్ర' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో దీనిని 'కొత్త లోక ' పేరుతో రిలీజ్ చేశారు. గ్రాండ్ సక్సెస్ తో ఈ మూవీ టీం సంబరాల్లో మునిగితేలుతోంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ చేసిన ఒక ఆసక్తికరమైన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించారు.
లాభాల్లో వాటా...
ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు సుమారు రూ. 254 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఇంతటి విజయం వెనుక ఉన్న ప్రధాన కారకుడు చిత్ర దర్శకుడు డొమినిక్ అరుణ్ అని దుల్కర్ సల్మాన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే, సినిమా లాభాల్లో వాటాను చిత్ర బృందంతో పంచుకుంటానని ప్రకటించారు. ఒక సినిమా భారీ విజయం సాధించినప్పుడు, దాని వెనుక పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన ప్రతిఫలం దక్కాలి. ముఖ్యంగా ప్రధాన సాంకేతిక నిపుణులను భాగస్వాములుగా చేస్తే, ఆ సినిమాను వారు తమ సొంత సినిమాగా భావిస్తారని తెలిపారు..
'కొత్త లోక ' ఒక ఫ్రాంచైజ్ మాత్రమే..
కొత్త లోక అనేది ఒక ఫ్రాంచైజ్ అని.. భవిష్యత్తులో ఇంకా నాలుగు సినిమాలు చేయబోతున్నామని దుల్కర్ సల్మాన్ వెల్లడించారు. సినిమా లాభాల్లో వాటాను చిత్ర బృందంతో పంచుకోవడం చాలి మంచి మోడల్ అని నేను నమ్ముతానని చెప్పుకొచ్చారు. తొలుత ఈ మూవీని తక్కువ బడ్జెట్ తో ఒక ఇండిపెండెంట్ సూపర్ హీరో సినిమా ప్లాన్ చేశామని దర్శకుడు డొమినిక్ అరుణ్ తెలిపారు . కానీ దుల్కర్ సలహాతో మరింత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నాము. బడ్జెట్ గురించి ఆలోచించుండా పనిచేయడమే మమ్మల్ని ముందుకు నడిపించిందని చెప్పారు.
' లోకా: చాప్టర్ 1 - చంద్ర' రికార్డులు
మలయాళీ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ ' లోకా: చాప్టర్ 1 - చంద్ర' చిత్రంలో నాస్లెన్, శాండీ మాస్టర్, అరుణ్ కురియన్, చందు సలీంకుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటివరకు ఇండియాలో రూ125 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించింది. విడుదలైన 20వ రోజున కూడా భారతదేశంలో 2.65 కోట్ల నెట్ కలెక్షన్లను నమోదు చేసి, బాక్సాఫీస్ వద్ద తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల గ్లోబల్ మార్క్‌ను దాటిన రెండవ మలయాళ చిత్రం నిలిచింది. ఇదే విధంగా కొనసాగితే మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సినిమా లాభాల్లో వాటాను చిత్ర బృందంతో పంచుకుంటానని దుల్కర్ సల్మాన్ నిర్ణయం, నిర్మాతగా ఆయన చూపిన ఉదారత, చిత్ర పరిశ్రమకు ఒక కొత్త ఒరవడిని తీసుకొస్తోందని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.