- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 4,87,312 ఎకరాల్లో పంటల సాగు
- ఈసారి సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడి
- గతేడాది కంటే ఈసారి అదనంగా 27,512 ఎకరాల్లో సాగుకు ప్లాన్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఖరీఫ్ ప్రణాళికను వ్యవసాయశాఖాధికారులు ఫైనల్ చేశారు. వానాకాలం సాగులో భాగంగా జిల్లాలో దాదాపు 4,87,312 ఎకరాల్లో పలు పంటలను సాగు చేసే అవకాశం ఉందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్అంచనా వేసింది. ఇందుకు గానూ విత్తనాలు ఎంత మేర అవసరమో ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. గతేడాది కంటే దాదాపు 27,512 ఎకరాల మేర అదనంగా ఈ సారి సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖాధికారులు అంచనాలు రూపొందించారు.
2,16,625 ఎకరాల్లో పత్తి సాగు..
ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖాధికారులు పేర్కొనడంతో డిమాండ్ ఉన్న పంటలను గతం కంటే కొంత ఎక్కువగా సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వేసవి దుక్కులు దున్నడంలో రైతులు బిజీగా ఉన్నారు. వానాకాలం పంటల సాగు, విత్తనాలు, ఎరువులపై ఇప్పటికే వ్యవసాయశాఖాధికారులు, డీలర్లతో కలెక్టర్ ఇటీవల సమీక్షించారు. జిల్లాలో పత్తి పంట పెద్ద ఎత్తున సాగు కానుంది. జిల్లా వ్యాప్తంగా 4,87,312 ఎకరాల్లో పత్తి, వరి, పెసలు, కంది, మొక్కజొన్న, వేరుశనగ, మిర్చితో పాటు పలు పంటలను రైతులు సాగు చేయనున్నారు.
గతేడాది వానాకాలం సీజన్లో జిల్లాలో 4,59,793 ఎకరాలు ఆయా పంటలను రైతులు సాగు చేశారు. గతేడాది కంటే ఈసారి అదనంగా దాదాపు 27,512 ఎకరాల సాగు విస్తీర్ణం పెరగనుంది. గతేడాది జిల్లాలో 2,02,262 ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఈ సీజన్లో 2,16,625 ఎకరాల్లో సాగు కానుంది. ఇందుకు గానూ 5,41,560 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం కానున్నాయి. గతేడాది వరి పంట సాగు 1,61,157 ఎకరాల్లో కాగా, ఈ సారి 1,65,854 ఎకరాల్లో సాగు కానుంది.
41,464 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు. గతేడాది మొక్కజొన్న 59,185 ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుత సీజన్లో 60,200 ఎకరాల్లో సాగు కానుంది. 29,694 ఎకరాల్లో గతేడాది మిర్చిని రైతులు సాగు చేయగా, ఈ సారి 32,168 ఎకరాల్లో పండించనున్నారు. వేరుశనగ 3,296 ఎకరాల్లో గతేడాది సాగు చేయగా, ఈసారి 2,359 ఎకరాల్లో సాగుకే పరిమితం కానుంది. ఇవే కాకుండా పెసలు, కందులు లాంటి పంటలను రైతులు సాగు చేయనున్నారు.
నాసిరకం విత్తనాలపై అలర్ట్గా ఉండాలి
నాసిరకం విత్తనాలపై రైతులు అలర్ట్గా ఉండాలి. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. 60శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను సొసైటీల్లో దొరుకుతున్నాయి. విత్తనాలను అధిక ధరలకు అమ్మే వారిపై చర్యలు తీసుకుంటాం.
- బాబూరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, భద్రాద్రికొత్తగూడెం