- ఆవిష్కరించిన హైకోర్డు జడ్జి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ పుస్తకాన్ని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ సత్యప్రియ కలిసి రచించిన ‘‘ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా’’అనే పుస్తకాన్ని బుధవారం హైకోర్టులో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యాక్ట్ చెక్‌కు సంబంధించిన పుస్తకం తీసుకురావాలన్న ఆలోచన రావడం అభినందనీయమని, ఫ్యాక్ట్ చెక్‌ను ప్రచారం చేయాలనే ఐడియా కూడా మంచి విషయమన్నారు.
ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో, వాస్తవాలను తనిఖీ చేసే వ్యవస్థను కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ఫ్యాక్ట్ చెక్ పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఓయూ జర్నలిజం హెచ్‌వోడీ ప్రొఫెసర్ స్టీవెన్‌సన్ మాట్లాడుతూ.. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్‌ల వరకు ఈ పుస్తకం ప్రకృతి వైపరీత్యాలు, పబ్లిక్ ప్రచారాలు, కరోనా సమయంలో ఏం జరుగుతుందనే విషయాలపై అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బుక్ అమెజాన్‌లో అందుబాటులో ఉందని పుస్తక రచయిత సుధాకర్ రెడ్డి తెలిపారు.
