శభాష్: డాగ్ స్క్వాడ్‌ లో అడుగుపెట్టిన తొలి వీధి కుక్క

శభాష్: డాగ్ స్క్వాడ్‌ లో అడుగుపెట్టిన తొలి వీధి కుక్క

తిండి కోసం చెత్త కుప్పలకాడ తిరుగులాడిన ఒక కుక్క పిల్ల. మనుషులు విసిరిన రాళ్ల దెబ్బలకు చావు అంచుల దాకా వెళ్లింది. కానీ, ఒక ఆపన్న హస్తం దానికి జీవితంపై ‘ఆశ’ పుట్టించింది. కఠోర సాధనలో అది జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకుంది. ఇప్పుడు తనలాంటి వీధి బతుకులకు కొత్త జీవితం ఇచ్చేందుకు ఓ స్ఫూర్తిగా మారింది.

సరిగ్గా ఏడాది క్రితం. కోల్‌ కతాలోని ఓ వీధి. తల్లి నుంచి తప్పిపోయిన ఓ కుక్క పిల్ల తిండి కోసం చెత్త కుప్ప దగ్గర తిరుగుతుండేది. ఆకతాయిలు కొందరు దానిని రాళ్లతో కొట్టేవాళ్లు. ఈ క్రమంలో ఓ రోజు అది తీవ్రంగా గాయపడింది. రక్తంలో కొట్టు మిట్టాడుతున్న దానిని ఆ దారిగుండా వెళ్తున్న బారక్‌ పూర్‌ డీఎస్పీ(డాగ్‌ స్క్వాడ్‌ ) సజల్‌ కుమార్‌ మండల్‌ చూశాడు. ఆలస్యం చేయకుండా ఆయన దానిని వెటర్నరీ డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లి రక్షించాడు. దానికి ‘ఆశ’ అని పేరు పెట్టి ఇంటికి తీసుకెళ్లాడు. ఐదు నెలల వయసున్న ఆ కుక్కపి ల్లను దత్తత తీసుకోవాలన్నది ఆయన ఆలోచన. కానీ, దాని చురుకుదనం ఆయన్ని బాగా ఆకట్టుకుంది. దానికి పోలీస్‌ డాగ్‌ ట్రెయినింగ్‌ ఇప్పించాలనుకున్నాడు. అయితే ‘రూల్స్‌‌’ అడ్డురావడంతో అధికారులు అందుకు అనుమతి ఇవ్వలేదు.

ఏంటా రూల్స్‌‌?
స్నిఫర్‌ డాగ్స్‌‌, కే–9 యూనిట్ల కోసం మామూలుగా అయితే రోటర్‌ వీలర్‌, జర్మన్‌ షెఫర్డ్‌‌ లాంటి విదేశీ జాతి కుక్కలను ఎంచుకుంటారు. లోకల్‌ బ్రీడ్‌ డాగ్స్‌‌కి అస్సలు అనుమతి ఇవ్వరు. అలాంటిది ఏకంగా ఓ వీధికుక్కకు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకుంటారా?. అయినా సజల్‌ కుమార్‌ పట్టువీడలేదు. ఎలాగోలా అధికారులను ఒప్పించి ట్రెయినింగ్‌ డాగ్‌ లలో ఆశను చేర్పించాడు. మొదట్లో మనుషులను అది నమ్మేది కాదు. దూరంగా పరిగెత్తేది. అయితే సత్యేంద్రనాథ్‌ అనే అధికారి శిక్షణతో మెల్లి గా మనుషులకు దగ్గరయ్యింది. మిగతా కుక్కలతో సమానంగా తిండి పెట్టి ఆరునెలల పాటు ‘ఆశ’కు శిక్షణ ఇప్పించారు అధికారులు.

విశ్వాసమే గెలిచింది
సజల్‌ కుమార్‌ నమ్మకాన్ని ‘ఆశ’ వమ్ము చేయలేదు. డాగ్‌ స్క్వాడ్‌ క్లియరెన్స్‌‌ టెస్ట్‌‌ల్ లో దాని ప్రదర్శన చూసి నోళ్లు తెరవడం అధికారుల వంతు అయ్యింది. హై జంప్‌ లో మిగతా కుక్కలు మూడు అడుగులు దూకితే.. ఆశ ఆరడుగులు దూకింది. పేలుడు పదార్థాలను చాలా వేగంగా (నిమిషాల వ్యవధిలోనే…) గుర్తించింది. వేగంలోనూ ఆశనే టాప్‌ . ఓవరాల్‌ గా అధికారులు ఆశకు క్లియరెన్స్‌‌ ఇచ్చారు. ఇండియాలో డాగ్ స్క్వాడ్‌ లో అడుగుపెట్టిన తొలి వీధి కుక్కగా ఆశ చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం సక్సెస్‌‌ కావడంతో మరికొన్నింటిని దత్తత తీసుకుని శిక్షణ ఇప్పించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే వందల కొద్దీ వీధి కుక్కలకు అర్థవంతమైన జీవితం దక్కినట్లే!.