- ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా పోలింగ్
- మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్, రిజల్ట్.. ఉప సర్పంచ్ ఎన్నిక
- ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
హైదరాబాద్, వెలుగు: సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 189 మండలాల్లోని 3,834 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది బుధవారమే పోలింగ్ సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన గ్రామాలకు తరలివెళ్లారు.
ఫస్ట్ ఫేజ్‌లో 189 మండలాల్లోని 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 396 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 12,960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక మొత్తం 37,440 వార్డులకు గాను 169 చోట్ల నామినేషన్లు రాలేదు. 9,633 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 27,628 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 65,455 మంది పోటీలో ఉన్నారు. ఈ విడతలో ఒక పంచాయతీకి ఎన్నిక జరగడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 564 మండలాల్లోని 12,723 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1,66,48,496 మంది ఓటర్లు ఉండగా.. తొలి విడతలో 56,19,430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 27,41,070, మహిళలు 28,78,159 మంది, ఇతరులు 201 మంది ఉన్నారు. ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదార్ పాస్‌బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డు.. ఇలా ఎస్ఈసీ సూచించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చు.
37,562 పోలింగ్ కేంద్రాలు
ఫస్ట్ ఫేజ్ ఎన్నికల కోసం 37,562 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు మూడ్రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇల్లిల్లూ తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. అందని వారికి పోలింగ్ రోజు అక్కడే బీఎల్వోలు అందించనున్నారు. అభ్యర్థులు లేదా పార్టీలు ఇచ్చే స్లిప్పులు సాదా తెల్ల కాగితంపై మాత్రమే ఉండాలి. వాటిపై ఎలాంటి గుర్తులు, అభ్యర్థి ఫొటోలు, పేర్లు, పార్టీ పేర్లు ఉండొద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌రాణి కుముదిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
3,591 మంది ఆర్వోలు..
రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల ఎన్నికల కోసం 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు, 3,591 మంది ఆర్వోలు, 93,905 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 3,461 పోలింగ్‌కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 45,086 బ్యాలెట్‌బాక్స్‌లను వినియోగిస్తున్నారు. కాగా, ఎన్నికల కోడ్ఉల్లంఘనలపై 3,214 కేసులు నమోదయ్యాయి. 31,428 మందిని బైండోవర్ చేశారు. రూ.1,70,58,340 నగదు పట్టుకున్నారు. రూ.2,84,97,631 విలువైన లిక్కర్సీజ్ చేశారు. రూ.2,22,91,714 విలువైన డ్రగ్స్, రూ.12,15,500 విలువైన మెటల్స్, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్డీజీపీ (లా అండ్ఆర్డర్) మహేశ్భవగత్ తెలిపారు.
ఓటర్ల కోసం యాప్..
ఓటర్ల సందేహాలను తీర్చడానికి ఎన్నికల కమిషన్ టీ. పోల్ (Te.Poll) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో నుంచి ఓటర్ స్లిప్పును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో? అక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకోవచ్చు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా 9240021456 నంబర్‌కు కాల్ చేయొచ్చు.

