మన తొలి రాఫెల్ యుద్ధ విమానం ఇదే

మన తొలి రాఫెల్ యుద్ధ విమానం ఇదే
  • ఫ్రాన్స్ లో అధికారికంగా అందుకున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్

భారత వాయుసేన అమ్ముల పొదిలోకి మరో తిరుగులేని అస్త్రం చేరుతోంది. పాక్, చైనా జంటకు షాక్ ఇచ్చే యుద్ధ విమానం మన సొంతం అయింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అందుకున్నారు. ఒప్పందంలో భాగంగా ఆ దేశం నుంచి రావాల్సిన 36 యుద్ధ విమానాల్లో తొలి జెట్ ను ఆయన అధికారికంగా స్వీకరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే దసరా నాడు ఈ యుద్ధ విమానాన్ని అందుకోవడం విశేషమని రాజ్ నాథ్ అన్నారు.

ఉగ్రవాదంపై పోరాటానికి ఫ్రాన్స్ దన్ను

మూడు రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ వెళ్లిన ఆయన ఇవాళ ఉదయం ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ తో పారిస్ లో బేటీ అయ్యారు రాజ్ నాథ్. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరును మాక్రాన్ అభినందించారు. టెర్రరిజంపై ఉమ్మడి పోరాటానికి తమ అండ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు.

ఫ్రాన్స్ మిలటరీ విమానంలో రాజ్ నాథ్

రాఫెల్ ను స్వీకరించేందుకు రాజ్ నాథ్ సింగ్.. పారిస్ నుంచి మెరిగ్నాక్ దసాల్ట్ ఏవియేషన్ యూనిట్ కు ఫ్రాన్స్ మిలటరీ యుద్ధ విమానంలో ప్రయాణించారు. పారిస్ లోని వెలిజీ-విల్లాకోబ్లే ఎయిర్ బేస్ నుంచి మెరిగ్నాక్ కు వెళ్లారు.

అక్కడ దసాల్ట్ ఏవియేషన్ అసెంబ్లీంగ్ యూనిట్ లో రాఫెల్ యుద్ధ విమానాల అసెంబ్లింగ్ ను పరిశీలించారు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. అక్కడ భారత్ కు అందించే మొదటి రాఫెల్ యుద్ధ విమానాన్ని ఆయన చూశారు.