
దేశ చరిత్రలోనే మొదటిసారి తాను తప్పు చేశానని ప్రధాని మోడీనే ఒప్పుకున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా.. మోడీ స్పందించకపోవడమే అందుకు నిదర్శనమని స్టాలిన్ చెప్పారు. ప్రధాని ప్రసంగం పూర్తిగా ఎదుటివారిని నమ్మబలికించేలా ఉన్నదని.. అయితే బీబీసీ డాక్యుమెంటరీ, అదానీ, హిండెన్ బర్గ్ వివాదం పై మోడీ ఎలాంటి వివరణ ఇవ్వలేదని స్టాలిన్ విమర్శించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తమిళనాడు గురించి కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదని మోడీ పై నిప్పులు చెరిగారు.
అలాగే ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిపైనా సీఎం స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల పార్లమెంట్ ప్రసంగంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన పలు ప్రశ్నలకు సంబందించి మోడీ సమాధానం చెప్పలేదని ఆరోపించారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పకుండా గంటల తరబడి మాట్లాడే కళను నేర్చుకున్నాడని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోకుండా ప్రజల నమ్మకమే తనకు రక్షణ కవచమని కబుర్లు చెబుతున్నాడని స్టాలిన్ ఆరోపించారు.