చేప చర్మంతో కుక్కకు సర్జరీ.. తెలంగాణలో మొదటి ఆపరేషన్‌‌‌‌ సక్సెస్‌‌‌‌

చేప చర్మంతో కుక్కకు సర్జరీ..  తెలంగాణలో మొదటి ఆపరేషన్‌‌‌‌ సక్సెస్‌‌‌‌

  బషీర్​బాగ్, వెలుగు: ఓ కుక్కకు చేప స్కిన్‌‌‌‌తో అరుదైన సర్జరీని వెటర్నరీ డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్‌‌‌‌తో కుక్క కాలిన చర్మం స్థానంలో తలాఫియా ఫిష్ స్కిన్‌‌‌‌తో రీప్లేస్ చేసి, కుక్కకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. 50 శాతం కాలిన గాయాలైన గోల్డీ అనే పెంపుడు కుక్కకు సర్జరీని సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా చేశారు. ఇది భారతీయ పశు వైద్యంలో నూతన ఆవిష్కరణ అని వెటర్నరీ డాక్టర్ వెంకట్ అన్నారు. తెలంగాణలో మొదటి శాస్త్ర ప్రయోగం విజయవంతం అవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం సర్జరీకి సంబంధించిన వివరాలను బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్లు వెంకట్ యాదవ్, షిరీన్ షెరీన్ వెల్లడించారు. 

‘‘ఈసీఐఎల్ చెందిన రాఘవ అనే వ్యక్తి గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 50 శాతం కాలిన గాయాలతో తీవ్ర అస్వస్థత గురైన పెంపుడు కుక్క గోల్డీని జూబ్లీహిల్స్‌‌‌‌లోని మా హాస్పిటల్‌‌‌‌కు తీసుకొచ్చాడు. మూడు నెలల పాటు అన్ని రకాల వైద్య పరీక్షల చేసి దాని ప్రాణాన్ని కాపాడాం. ఆ తర్వాత ప్రాసెస్ చేసిన తలాఫియా చేప చర్మాన్ని కుక్క గాయపడిన ప్రాంతాలపై (అంటుకట్టే విధానంతో) సర్జరీ చేసి, అమర్చాం. ఇది నొప్పిని తగ్గించి ఇన్ఫెక్షన్‌‌‌‌ను నివారిస్తుంది. తద్వారా సహజ కణజాల పునరుత్పత్తికి దోహదపడుతుంది. సహజ కొల్లాజెన్, ఒమేగా కొవ్వు ఆమ్లాలు బయో యాక్టివ్ సమ్మేళనాలతో సమృద్ధిగా ఉన్న ఈ చేప చర్మం తాత్కాలిక చర్మ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది”అని వారు తెలిపారు. ప్రస్తుతం కుక్క పూర్తి ఆరోగ్యంగా ఉందని, చర్మం సహజంగా ఉందని వెల్లడించారు.