ఇసుక అక్రమ తవ్వకాలపై మత్స్యకారుల విన్నూత నిరసన

ఇసుక అక్రమ తవ్వకాలపై మత్స్యకారుల విన్నూత నిరసన

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే.గంగవరంలో మత్స్యకారులు విన్నూత నిరసన చేపట్టారు. కోటిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న పాతకోట సమీపంలో గోదావరి నదికి అడ్డుకట్ట వేసి అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం దారుణమని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలని గోదావరి నదిలో పడవలపై  నినాదాలు చేస్తూ మత్స్యకారులు నిరసన తెలిపారు. గోదావరికి అడ్డుకట్ట వేసి ఇసుక మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ దందాల వలన 18 వేల మంది మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని గంగపుత్రులు వాపోయారు.

ఇసుక ర్యాంపును ఏర్పాటు చేసి రాత్రి పగలూ తేడా లేకుండా ఇసుక తవ్వకాలు జరపడం వలన పర్యావరణం దెబ్బతింటుందని.. వరదలు వచ్చినప్పుడు తాము ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. సముద్రం నుండి గోదావరి పైకి వచ్చే ఆటుపోట్లకు అంతరాయం కలిగి మత్స్య సంపద తగ్గిపోతుందని.. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. 2019 న్యూ మైనింగ్ పాలసీ ప్రకారం ఇసుక త్రవ్వకాలు మాన్యువల్ గానే చేయాలని, మిషనరీతో ఏ విధమైన తవ్వకాలు చేయకూడదని చెప్పారు. అలా చేయడం వలన రైల్వే, బ్రిడ్జి వంటి నిర్మాణాలు కూడా కూలిపోతాయన్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా అక్రమ ఇసుక తవ్వకాలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చేపల వేటే జీవనంగా బ్రతుకుతున్న మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు.