వీకెండ్ కు వెళ్లిన ఐదుగురు ఏపీ విద్యార్థులు తమిళనాడులో మృతి

వీకెండ్ కు వెళ్లిన ఐదుగురు ఏపీ విద్యార్థులు  తమిళనాడులో మృతి

చెన్నై: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం చెన్నై– తిరుపతి నేషనల్ హైవేపై తిరువళ్లూర్ జిల్లా రామన్ చేరి వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును ఓ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఒంగోలుకు చెందిన ఈ ఏడుగురు విద్యార్థులు చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీకెండ్ సందర్భంగా తిరువళ్లూర్ కు వెళ్లిన వీరంతా ఆదివారం సాయంత్రం తిరిగి కాలేజీకి బయలుదేరారు. రామన్ చేరి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును రాజస్థాన్ వెళ్తున్న ఓ లారీ బలంగా ఢీకొట్టింది. 

దీంతో చేతన్, ముకేశ్, నితీశ్, వర్మ, రామ్మోహన్ ప్రాణాలు కోల్పోయారు. చైతన్య, విష్ణు అనే ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.  పోలీసులు గాయపడిన ఇద్దరినీ అంబులెన్స్ లో తిరువళ్లూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.