
చింతకాని, వెలుగు:- మున్నేరు వాగులో చిక్కుకున్న ఐదుగురు పశువుల కాపరులను అధికారులు కాపాడారు. మండల పరిధిలోని చిన్నమండలం గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య, మొండితోక పుల్లయ్య, గుండ్ల వెంకటేశ్వర్లు, దారెల్లి శ్రీను, కుక్కల గోపి రోజులాగే గురువారం పశువులను మేపేందుకు ఖమ్మం మున్నేరు వాగులోకి వెళ్లారు. కాగా, ఎగువన కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద క్రమంగా పెరిగిపోవడంతో ఆ ఐదుగురు అక్కడే చిక్కుకున్నారు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే వారిని కాపాడాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ సహా 25 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని ఐదుగురు పశువుల కాపారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.