
లండన్ : బ్రిటన్ రాజధాని లండన్‌లో దీపావళి వేడుకలలో విషాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం సంభవించి భారత సంతతి కుటుంబంలో ఐదుగురు చనిపోయారు. మరో వ్యక్తి గాయపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. రాత్రి దీపావళి వేడుకలు నిర్వహించారని కొంతసేపటి తర్వాత ఉన్నట్టుండి వారి ఇంటికి మంటలు అంటుకున్నాయని స్థానికులు చెప్పారు.
‘ఆదివారం రాత్రి హాన్ స్లో ప్రాంతంలోని చానెల్ క్లోజ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లతో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాం. మేం వెళ్లేసరికే ఐదుగురు చనిపోయారు. గాయపడిన మరొకరిని వెంటనే ఆస్పత్రికి తరలించాం. బాధితుడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు డాక్టర్లు చెప్పారు’ అని పోలీసులు చెప్పారు..