టీడీపీకి షాక్, బీజేపీలో చేరనున్న రాజ్యసభ ఎంపీలు

టీడీపీకి షాక్, బీజేపీలో చేరనున్న రాజ్యసభ ఎంపీలు

ఏపీలో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బకు తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఒకేసారి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. పార్టీలో ప్రధాన నేతలైన సుజనా చౌదరి , గరికపాటి రామ్మోహన్ రావు, సీఎం రమేశ్, టి.జి. వెంకటేశ్, తోట సీతామహలక్ష్మీ లు టీడీపీ ని వీడి బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. వీరంతా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ను కలిసి, తమను పార్టీలోకి  చేర్చుకోవాల్సిందిగా కోరారు. టీడీపీ నుంచి తమను బీజేపీలోకి విలీనం చేయమని కోరారు. ఈ విలీన ప్రక్రియ పనులను అమిత్ షా  హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి అప్పజెప్పినట్లు తెలిసింది. అంతకు ముందు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలసిన ఈ ఐదుగురు.. ఆయనతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ విలీన ప్రక్రియ లో చక్రం తిప్పింది రామ్ మాధవే.

వీరంతా ఈ రోజు సాయంత్రం రాజ్యసభ అధ్యక్షుడు ఎమ్.వెంకయ్య నాయుడు ను కలిసి తమను బీజేపీ ప్రత్యేక బృందంగా  గుర్తించమని కోరుతూ పత్రాలు ఇవ్వనున్నారు. ఈ విషయంపై  రోజు సాయంత్రం కల్లా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  ప్రస్తుతం టీడీపీకి  భవిష్యత్తు లేదని వీరంతా తలోదారి చూసుకుంటున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనలో ఉన్నారు.