ఐదు వేల కోట్లు..ఆఫర్​ ఇచ్చినా వద్దన్నా : కేసీఆర్​

ఐదు వేల కోట్లు..ఆఫర్​ ఇచ్చినా వద్దన్నా : కేసీఆర్​
  •      కేంద్ర మంత్రి పదవిని కాదనుకున్నా 
  •     తెలంగాణ కోసం 14 ఏండ్లు కొట్లాడిన
  •     ఇది ఫామ్​హౌస్​ కాదు..  శిక్షణ మందిరం
  •     దళితబంధును దళిత సమాజం గుర్తించలే

సిద్దిపేట/ములుగు, వెలుగు : తెలంగాణ ఉద్యమం  ఆపితే  ఐదు వేల కోట్లు ఇచ్చి,  కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని  కొందరు ఆఫర్ ఇచ్చినా వద్దనుకున్నానని  మాజీ సీఎం కేసీఆర్​ తెలిపారు.  ‘నా 24 ఏండ్ల రాజకీయ జీవితంలో 14  ఏండ్లు రాష్ట్రం కోసం పోరాడిన. పదేండ్లు రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టిన. తెలంగాణ ప్రజల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన’ అని పేర్కొన్నారు. నినాదాలు చేస్తూ  చేతిలో రాళ్లు పట్టుకొని చేసేది ఉద్యమం కాదని,  ఉద్యమానికి ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం ఉండాలని  అన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్  సోమవారం ఎర్రవల్లి  ఫామ్ హౌస్ లో కేసీఆర్​ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు.

 ఈ సందర్భంగా  ప్రవీణ్​కుమార్​తో పాటు ఆయన అనుచరులకు  కేసీఆర్​ గులాబీ కండువాలు  కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత కేసీఆర్​ మాట్లాడుతూ ‘ఇది కేసీఆర్​ ఫామ్​హౌస్​ అని బద్నాం చేస్తారు గానీ  నిజానికిది ఫామ్​హౌస్​ కాదు.. శిక్షణ మందిరం.. నేను గ్యారంటీగా చెప్తున్న.. తెలంగాణవాదం, బహుజనవాదం వేరు కాదు..  మన అందరం కలిసి  భవిష్యత్తులో  అద్భుత విజయం సాధిస్తాం.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాం..  మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన చారిత్రక అవసరం   ఎంతైనా ఉన్నది’ అని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్ కు పార్టీలో మంచి పొజిషన్ ​ఇస్తామని మాట ఇచ్చారు. 

సంతోషం వస్తే ఉబ్బుతరు.. బాధ వస్తే కుంగుతరు 

సంతోషం వస్తే ఉబ్బడం , బాధ వస్తే కుంగి పోవడం తెలంగాణ ప్రజల  లక్షణమని కేసీఆర్​ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనకు  కొన్ని వందల అనుభవాలు ఉన్నాయని గుర్తుచేశారు.  టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడుకు రెండే రెండు విషయాలు చెప్పానని,  ఒకటి తెలంగాణ ప్రజలు బొంద పెడుతారని,  రెండోది  ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చే రుణంలో వందకు 30 శాతం నిధులు వృథా అవుతాయని చెప్పానని, అవి చెప్పినవి చెప్పినట్టు జరిగాయన్నారు. తాను అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 3 కోట్ల టన్నుల ధాన్యం పండేలా చేశానని చెప్పారు. 

దళితబంధు పథకాన్ని చూసి  అంబేద్కర్ మనుమడు ఆశ్చర్యపోయాడని, లక్షా పదివేల మందికి  దళిత బంధు ప్రొసీడింగ్స్​ ఇచ్చినా దళితసమాజం ఎందుకు గుర్తించలేదో అర్థం కాలేదని అన్నారు.  దేశంలో దళితులకు 20 శాతం ఓట్లున్నాయని, వాళ్లంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో దళితుల మీద నిత్యం దాడులు జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. ఈ పరిస్థితి పోవాలని అన్నారు.  

తెలంగాణవాదానికి బహుజనవాదం తోడవ్వాలి :  ఆర్​ఎస్​పీ

తెలంగాణ వాదానికి బహుజన వాదం తోడైతే రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందుతుందని ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్ అన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంతో కేసీఆర్ భూకంపాన్ని సృష్టించి,  ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు.  తెలంగాణకు బలమైన పునాదులు వేసింది కేసీఆరే అని పేర్కొన్నారు.  గత రెండున్నరేండ్లుగా పగలనక, రేయనక నాలుగు వేల గ్రామాలు తిరిగి లక్షలాది మంది  బహుజనులను కలిశానని గుర్తు చేసుకున్నారు. మాయావతి అనుమతితోనే బీఆర్ఎస్​తో పొత్తులకు చర్చలు జరిపామని ప్రవీణ్​ చెప్పారు. 

‘నేను అమ్ముడుపోతే అధికార పార్టీ లో ఉండే వాడిని , అమ్ముడుపోలేదు గనుకే ఇక్కడ ఉన్నాను. సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారం నమ్మవద్దు’ అని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీ  విజయ దుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,  బీఆర్ఎస్ నేతలు దేవీ ప్రసాద్, రవీందర్ సింగ్  పాల్గొన్నారు.