కూకట్‌పల్లి, వెలుగు: చైనా మాంజా మెడకు చుట్టుకొని ఐదేండ్ల బాలిక మృతి చెందింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో జరిగింది. కూకట్‌పల్లి పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు. కూకట్‌పల్లి గోకుల్ప్లాట్స్లో నివసించే రామసాగర్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. ఇతను పటాన్చెరు సమీపంలోని ఖాజిపల్లిలో కొంతకాలం క్రితం ఇంటిని కొనుగోలు చేశాడు.
ఆ ఇంటి వద్ద జరుగుతున్న ఇంటీరియర్ పనులను చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబంతో కలిసి బైక్‌పై ఖాజిపల్లికి వెళ్లారు. వీరు సాయంత్రం తిరిగి ఇంటికి వస్తున్నారు. పటాన్చెరు నుంచి కూకట్‌పల్లి వైపు వస్తున్న వీరు నేరుగా ఇంటికి వెళ్లకుండా కేపీహెచ్‌బీ కాలనీ వద్ద నగల దుకాణానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఆ షాప్ దాటి బైక్ ముందుకు వెళ్లడంతో వివేకానందనగర్కాలనీ సమీపంలో యూటర్న్ తీసుకునేందుకు బైక్‌ను రామసాగర్ ముందుకు పోనిచ్చాడు. సాయంత్రం 4 గంటల సమయంలో వీరు కూకట్‌పల్లి వివేకానందనగర్కాలనీ మెట్రో పిల్లర్ నెంబర్ 781 వద్దకు వచ్చిన సమయంలో బైక్ పైన తండ్రి ముందు కూర్చున్న నిష్వికదరియా(5) సడెన్‌గా ఏడ్వడం మొదలుపెట్టింది.
వెంటనే బైక్‌ను పక్కకు ఆపిన తండ్రి రామసాగర్.. కూతురు మెడకు చైనా మాంజా త్రెడ్ చుట్టుకొని రక్తం కారుతుండటం గమనించాడు. వెంటనే చిన్నారిని సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిష్వికదరియా అధిక రక్తస్రావం కావటంతో మృతి చెందింది. కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
