గజ్వేల్, సిద్దిపేటలో రూ.1,010 కోట్ల ఖర్చు.. రాజేంద్రనగర్​లో కోటి 37 లక్షలే

గజ్వేల్, సిద్దిపేటలో రూ.1,010 కోట్ల ఖర్చు.. రాజేంద్రనగర్​లో కోటి 37 లక్షలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మాత్రం ఒక రూ.కోటి 37 లక్షలె ఖర్చు కావడానికి ఎవరి అసమర్థత కారణమ ని హోర్డింగ్, ఫ్లెక్సీలు, పోస్టర్లు వేశారు.

నియోజక వర్గంలోని శంషాబాద్, నార్సింగి, బండ్లగూడ జాగీర్, మణికొండ లతో పాటు  వివిధ ప్రాంతాల్లో  బీజేపీ నేత,  మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి వీటిని ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్లలో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ పేరుతో గజ్వేల్ లో రూ.318.2 కోట్లు, సిద్దిపేటలో రూ. 692.31 కోట్లు ఖర్చు చేయగా, రాజేంద్రనగర్ లో మాత్రం రూ.1కోటి37 లక్షలె ఖర్చు చేయడమేంటని.. ఇందుకు కారణం ఎమ్మెల్యే అసమర్థతనా? లేక సీఎం వివక్షనా? రాజేంద్రనగర్ ప్రజలారా ఇకనైనా ఆలోచించండని వాటిలో పేర్కొన్నారు.

ఇదివరకు కూడా కేంద్రం ఎన్ని నిధులు ఇస్తున్నది, రాష్ట్రం ఎన్ని నిధులు ఇస్తుందనే లెక్కలతో ఆయన పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. కొన్ని నియోజకవర్గాలనే డెవలప్ చేస్తున్నారని, చాలా వాటిని పట్టించుకోవడంలేదన్న విషయం ప్రజలకు తెలిసేందుకే ఇలా ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.