ఓయూలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల బందోబస్తు

ఓయూలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల బందోబస్తు

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్ బర్త్ డే వేడుకల సందర్భంగా ఈ రోజు నుంచి ఓయూలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‎ను ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే టీఆర్ఎస్ నేతలు ఓయూలో అడుగు పెట్టే అర్హత లేదంటూ విద్యార్థులు ఫైర్ అయ్యారు. ఉద్యోగ నోటిఫికెషన్లు ఇవ్వడం లేదని, యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించడం లేదని అంటున్నారు. టీఆర్ఎస్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో ఓయూలో అడుగు పెట్టనివ్వమని తెలిపారు. టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలను చింపివేశారు. ఫ్లెక్సీలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. పలువురు విద్యార్థులను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. 

కాగా.. ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ ఆర్ట్స్ కాలేజీ ముందు పెట్రోల్ బాటిల్‎తో నిరసనకు దిగాడు. పెట్రోల్ మీద పోసుకుంటుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ‘నోటిఫికేషన్ ఇస్తేనే టీఆర్ఎస్ నాయకులు ఓయూలోకి అడుగుపెట్టాలి. నోటిఫికేషన్ ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఓయూకి వస్తే మా శవాలపై నుంచి వెళ్ళాలి. ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల  కుటుంబాలకు క్షమాపణ చెప్పి.. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి’ అని సురేష్ డిమాండ్ చేశాడు.  పోలీసులు.. సురేష్‎ని అరెస్ట్ చేసి పీఎస్‎కి తరలించారు.