V6 News

ఇంగ్లిష్ సదువుతున్నరు.. లెక్కలు చేస్తున్నరు.. సర్కారు బడుల్లో మారుతున్న చదువులు

ఇంగ్లిష్ సదువుతున్నరు.. లెక్కలు చేస్తున్నరు.. సర్కారు బడుల్లో మారుతున్న చదువులు
  • 2022తో పోలిస్తే సెకండ్ క్లాస్ స్టూడెంట్లలో పెరిగిన నైపుణ్యాలు
  • తెలుగు, ఇంగ్లిష్‌‌‌‌ అనర్గళంగా చదువుతున్న విద్యార్థులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిట్రసీ అండ్ న్యుమోరసీ (ఎఫ్​ఎల్​ఎన్) గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా రెండో తరగతి విద్యార్థులు గతంతో పోలిస్తే చదవడం, లెక్కలు చేయడంలో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని తాజాగా ఎస్సీఈఆర్టీ నివేదిక వెల్లడించింది. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ (సీఎస్ఎఫ్​) సహకారంతో ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని 1,750 పాఠశాలల్లో 8,500 మంది విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తాజాగా రిలీజ్ చేశారు. దీనిలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 

2022-23 విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో భారీ మార్పు వచ్చింది. ఇంగ్లిష్ సబ్జెక్టులో విద్యార్థులు వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. 2022లో కేవలం 4 శాతం మంది మాత్రమే ఇంగ్లిష్ వాక్యాలను చదవగలిగితే, ఇప్పుడు ఆ సంఖ్య 29 శాతానికి చేరింది. అంటే దాదాపు 7 రెట్ల వృద్ధి నమోదైంది. అలాగే తెలుగు వాక్యాలను స్పష్టంగా చదవగలిగే వారి సంఖ్య 9 శాతం నుంచి 35 శాతానికి (4 రెట్లు) పెరిగింది. ఉర్దూలోనూ 40 శాతం మంది విద్యార్థులు అనర్గళంగా చదువుతున్నారు. 

లెక్కల్లోనూ భళా..  మ్యాథ్స్​ లోనూ పిల్లలు మెరుగైన ఫలితాలు సాధించారు. అప్పు తెచ్చే లెక్కలు చేయడంలో 2022లో 10 శాతం మంది మాత్రమే ప్రతిభ చూపగా, ఇప్పుడు 30 శాతానికి పెరిగింది. కూడికల్లో 18 శాతం నుంచి 43 శాతానికి విద్యార్థుల నైపుణ్యం మెరుగుపడింది. అంటే లెక్కల్లో విద్యార్థుల సామర్థ్యం రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది. ఈ అభ్యసన సామర్థ్యాల్లో పెద్దపల్లి, నారాయణపేట, వనపర్తి, జనగామ, ఖమ్మం జిల్లాలు రాష్ట్రంలోనే టాప్ పెర్ఫార్మర్లుగా నిలిచాయి. డిజిటల్ పద్ధతిలో మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల ద్వారా ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా పరీక్షించి ఈ నివేదికను రూపొందించారు.

మూడేళ్లలో 80 శాతం లక్ష్యం..

వచ్చే రెండు మూడేళ్లలో 80 శాతం మంది విద్యార్థులు నిర్ణీత ప్రమాణాల మేరకు చదవడం, లెక్కలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, జిల్లా వారీగా పర్యవేక్షణ పెంచడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

పెరిగిన సామర్థ్యాలు ఇలా..

సబ్జెక్టు / సామర్థ్యం    2022-23     2025-26 
తెలుగు వాక్యాలు చదవడం    9%    35%
ఇంగ్లిష్ వాక్యాలు చదవడం    4%    29%
ఉర్దూ వాక్యాలు చదవడం    19%    40%
కూడికలు చేయడం     18%    43%
తీసివేతలు    10%    30%