వరద నష్టం.. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు

వరద నష్టం.. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు

తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు అయితే.. ప్రజలకు ప్రయోజనాలు కలిగించేది కాళేశ్వరం ప్రాజెక్టు అని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 107.5 మీటర్ల ఎత్తును లెక్కలోకి పరిగణలోకి తీసుకుని కాళేశ్వరం నిర్మాణం జరిగిందని వివరించారు. ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు లేవని, 108.19 మీటర్ల మేర వరదలు రావడంతో పంప్ హౌస్ లు మునిగినట్లు చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు కట్టడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని, రాష్ట్ర ప్రజలపై ఆ పార్టీకి చెంది నేతలు కక్ష కట్టారని విమర్శించారు. దమ్ముంటే తెలంగాణకు జాతీయహోదా ప్రాజెక్టు ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా వరదలు రానట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, గోదావరి వరదలు 5 వందల ఏళ్లకు ఒకసారి వస్తాయని కేంద్ర జల సంఘమే చెప్పిందని తెలిపారు. వరద నష్టం వచ్చినప్పుడు కేంద్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.

కాంగ్రెస్ హాయాంలో కట్టిన ప్రాజెక్టులు రెండు సార్లు మునిగాయని, గత చరిత్ర తెలుసుకుని ఆ పార్టీకి చెందిన నాయకులు విమర్శలు చేయాలని సూచించారు. జూరాల ప్రాజెక్టు నీటి లభ్యత ఉన్న చోట కట్టారా? అని సూటిగా ప్రశ్నించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకొనేందుకు కేసులు వేసి సైంధవ పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ కాదా? విమర్శించారు. ఆల్మట్టి, అప్పర్ భద్ర ద్వారా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమకు ప్రజల మెప్పు కావాలి...ప్రతిపక్షాల మెప్పు అవసరం లేదన్నారు. తెలంగాణ పాలన విఫలం కాలేదని.. పీయూష్ గోయల్ విఫలమైన మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రం చిల్లరగా ప్రవర్తిస్తోందని, తెలంగాణలో పత్తిని రెండో పంటగా వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పెంటారెడ్డిని అవమానించడం అంటే తెలంగాణను అవమానించడమేనని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.