రైతులకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలి

రైతులకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలి
  • బీజేపీది సబ్‌‌కా సాత్‌‌, సబ్‌‌కా వికాస్‌‌ కాదు.. పూరా బక్వాస్‌‌
  • గోదావరి పుష్కరాలకు నిధులు ఎందుకు ఇవ్వరు ?
  • మాజీమంత్రి,  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు

కామారెడ్డి, వెలుగు : వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు డిమాండ్‌‌ చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బంజర శివారులో వరదల కారణంగా నీట మునిగిన పంటలను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. 

కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో వరద బాధితులను అదుకుంటామని సీఎం చెప్పి నెల రోజులు కావస్తున్నా.. ఇప్పటివరకు పట్టించుకోవడం లేదన్నారు. వరదల కారణంగా కామారెడ్డి జిల్లాలో రూ.340 కోట్ల మేర నష్టం జరిగిందని ఆఫీసర్లు రిపోర్ట్‌‌ ఇచ్చినా... నయాపైసా కూడా విడుదల చేయడం లేదని మండిపడ్డారు. 

సీఎం పరిశీలించిన బ్రిడ్జిని సైతం ఇప్పటివరకు పునరుద్ధరించలేదన్నారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలకు రిపేర్లు చేయడంతో పాటు చెరువుల గండ్లు పూడ్చాలని, ఇండ్లు కూలినపోయిన వారిని అదుకోవాలని డిమాండ్‌‌ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌‌ఎస్‌‌ 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

బీఆర్‌‌ఎస్‌‌ నాయకులను ఇబ్బంది పెడుతున్న పోలీసులు, ఆఫీసర్ల సంగతి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాల్డొండ ఎమ్మెల్యే, మాజీమంత్రి వేముల ప్రశాంత్‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్‌‌, గంప గోవర్ధన్‌‌, హన్మంత్ షిండే, జనార్దన్‌‌గౌడ్‌‌, జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌‌, జడ్పీ మాజీ చైర్మన్‌‌ రాజు, మండల అధ్యక్షుడు శివాజీరావు, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్​రావు పాల్గొన్నారు.

బీజేపీది పూరా బక్వాస్‌‌..


‘బీజేపీది సబ్‌‌ కా సాత్‌‌, సబ్​కా వికాస్‌‌ కాదు.. పూరా బక్వాస్’ అని హరీశ్‌‌రావు విమర్శించారు. బీజేపీ పేదలు, రైతులు, దళితుల పక్షాన ఉండడం లేదని, తెలంగాణ అంటే చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల కోసం ఏపీకి రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా నయాపైసా ఇవ్వడం లేదని విమర్శించారు.