విజయవాడకు వరద ముప్పు

విజయవాడకు వరద ముప్పు

లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు

లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యే అవకాశం

నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల నుండి రెండు రోజుల్లో చుట్టుముట్టనున్న వరద

విజయవాడ: కృష్ణా నదిలో వరద పోటెత్తుతుండడంతో విజయవాడ పరిసర ప్రాంతాలకు వరద ముప్పు ఏర్పడింది. గత ఏడాది మాదిరే ఈసారి కూడా వరద అంతకంతకూ పెరుగుతోంది. మరో రెండు రోజుల్లో ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి భారీగా వరద నీరు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  ఎగువ నుండి వస్తున్న వరదకు తోడు భారీ వర్షాలు కొనసాగితే.. విజయవాడతో పాటు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు  ముంపుకు గురయ్యే  అవకాశం ఉందని అధికారుల అంచనా.

నీటిపారుదల శాఖ అధికారుల హెచ్చరికలతో జిల్లా కలెక్టర్ అప్రమత్తమయ్యారు. తహసీల్దార్లు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వరద ప్రవాహాన్ని.. ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విజయవాడలోని రాణిగారి తోట, తారకరామ నగర్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. నగరంలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తీర ప్రాంత ప్రజలను ముందే ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.