భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద బాధితుల రాస్తారోకో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద బాధితుల రాస్తారోకో

అందరికీ వరద సాయం అందించాలని డిమాండ్​
బూర్గంపహాడ్, వెలుగు:
వరదలతో నష్టపోయిన వాళ్లను వదిలేసి లీడర్లకు అనుకూలమైనవాళ్ల పేర్లను సాయం అందజేసేందుకు రాసుకుంటున్నారని వరద బాధితులు ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్​మండలంలో బుధవారం రెండుచోట్ల రాస్తారోకో చేపట్టారు.  మండలకేంద్రంలోని గౌతంపురం కాలనీవాసులు బూర్గంపహాడ్–కొత్తగూడెం రోడ్డుపై, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం వాసులు స్థానిక రోడ్డుపై బైఠాయించారు. నష్టపరిహారం పంపిణీ కోసం తమ గ్రామాల్లో తయారుచేస్తున్న జాబితా తప్పులతడకగా ఉందని మండిపడ్డారు. టీఆర్​ఎస్​ లీడర్లు, ఆఫీసర్లు కుమ్మక్కై వరదలో మునిగిన ఇండ్లను వదిలేసి, వరద వల్ల నష్టపోనివాళ్ల పేర్లు చేరుస్తున్నారని వారు ఆరోపించారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించడంలోనూ వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సాయం అందజేయాలని డిమాండ్​ చేశారు. సుమారు మూడుగంటల పాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేసేవరకు ఆందోళన విరమించేదిలేదని బాధితులు తేల్చిచెప్పారు. తహసీల్దార్ భగవాన్ రెడ్డి అక్కడికి చేరుకొని అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.