సిక్కింలో వరదలు.. టూరిస్టులను రక్షించిన సైన్యం

సిక్కింలో వరదలు.. టూరిస్టులను రక్షించిన సైన్యం

గ్యాంగ్ టక్: నార్త్  సిక్కింలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి చిక్కుకుపోయిన 400 మంది పర్యాటలకును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సిబ్బంది కాపాడారు. తాత్కాలిక బ్రిడ్జిని ఏర్పాటు చేసి సహాయక పనులు చేపట్టారు. ప్రతికూల వాతావరణంలోనూ అధికారులు, బీఆర్ఓ సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేసి టెంపరరీ బ్రిడ్జిని నిర్మించారు. శనివారం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్ఎస్ డీఎంఏ) కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంది. ఉదయం 11 గంటలకు పర్యాటకుల రెస్క్యూ ఆపరేషన్​ను ప్రారంభించామని ఎస్ఎస్ డీఎంఏ అధికారులు తెలిపారు. 70 చిన్న వాహనాలతో పాటు 19 బస్సులను రంగంలోకి దించి టూరిస్టులను తరలించామని చెప్పారు. మరిన్ని బస్సులు ఏర్పాటు చేసి పర్యాటకులను తరలిస్తామని పేర్కొన్నారు. అలాగే వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్డును అధికారులు పునరుద్ధరిస్తున్నారు. ఈ నెల 16న నార్త్  సిక్కింలో  కురిసిన భారీ వరదలకు చుంగ్ థాంగ్  వద్ద రోడ్డు కొట్టుకుపోయి రెండువేల మందికిపైగా పర్యాటకులు చిక్కుకుపోయారు.