ఇకపై ఆ పప్పులు ఉడకవు.. చిన్నస్వామిలో సీన్ మారింది: బెంగళూర్ పిచ్‎ సీక్రెట్ బయటపెట్టిన పడిక్కల్

ఇకపై ఆ పప్పులు ఉడకవు.. చిన్నస్వామిలో సీన్ మారింది: బెంగళూర్ పిచ్‎ సీక్రెట్ బయటపెట్టిన పడిక్కల్

బెంగళూర్‎లోని చినస్వామి స్టేడియం.. గ్రౌండ్ చిన్నగా ఉంటుంది.. ఈ స్టేడియంలో జరిగే మ్యాచుల్లో దాదాపు భారీ స్కోర్లే నమోదు అవుతుంటాయి. బ్యాటర్ల బౌండ్రీల సునామీతో అభిమానులకు కూడా కావాల్సినంత మజా దొరుకుతుంది. కానీ ఇకపై ఆ పప్పులు ఉడకవు.. వచ్చి రాగానే సిక్సులు కొడతామంటే కుదరదు.. చిన్నస్వామిలో సీన్ మారింది అంటున్నాడు ఆర్సీబీ బ్యాటర్, కర్నాటక లోయల్ బాయ్ దేవదత్ పడిక్కల్. 

ఆదివారం (ఏప్రిల్ 5) చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచులో అతిథ్య బెంగళూర్ 43 పరుగుల తేడాతో చెన్నైను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ బ్యాటర్ పడిక్కల్ మాట్లాడుతూ చిన్నస్వామి  పిచ్‎పై కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నస్వామి పిచ్‎లో బ్యాటింగ్ తీరు మారిందని.. గతంలో మాదిరిగా తొలి బంతి నుంచే భారీ స్కోరు చేయడం ఇకపై సాధ్యం పేర్కొన్నాడు.

తొలి ఓవర్లలో పిచ్ కొంచెం జిగటగా ఉంటుందని.. దీంతో మొదటి నుంచి దూకుడుగా ఆడటం ఇబ్బందికరమన్నాడు. తొలుత వికెట్లు కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని.. బంతి పాతబడే కొద్ది బ్యాటింగ్ ఈజీ అవుతుందని చెప్పాడు. 2025లో మా హోం గ్రౌండ్‎లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత మేం ఈ విషయాన్ని గుర్తించామని తెలిపాడు. ఆ ఎదురుదెబ్బల నుంచి గుణపాఠం నేర్చుకుని.. తొలి 10 ఓవర్లలో అతిగా దూకుడుగా వెళ్లకుండా ఆడాలని నిర్ణయించుకున్నామని టీమ్ ప్లానింగ్ వివరించాడు. 

చెన్నై, ఆర్సీబీ మ్యాచ్ అచ్చం పడిక్కల్ చెప్పిన మాదిరిగానే జరిగింది. ఈ మ్యాచ్‎లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ పవర్ ప్లేలో అనుకున్నంతా దూకుడుగా ఆడకలేకపోయింది. విధ్వంసకర ప్లేయర్ సాల్ట్, కోహ్లీ వేగంగా రన్స్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. పవర్‌ప్లేలో ఆర్సీబీ కేవలం 51 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ ఆర్సీబీ 10 ఓవర్ల వరకు వికెట్లను కాపాడుకుంది. ఆ తర్వాత నుంచి గేర్ మార్చి ఆర్సీబీ బ్యాటర్లు పరుగుల వరద పారించారు.

 చివరి ఐదు ఓవర్లలోనే  ఆర్సీబీ 97 పరుగులు చేసిందంటే ఆ జట్టు ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక, కొండంత లక్ష్యం కండ్ల ముందు ఉండటంతో పిచ్ పరిస్థితి గురించి పట్టించుకోకుండా చెన్నై బ్యాటర్లు తొలి బంతి నుంచే బాదుడు మొదలు పెట్టారు. దీంతో పవర్ ప్లేలోనే ఆ జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడికి గురై చివరకు మ్యాచ్ ఓటమి పాలైంది.