- బెంగుళూరులో నిందితుడిని అరెస్ట్ చేసిన నల్లకుంట పోలీసులు
ముషీరాబాద్, వెలుగు: విదేశాల నుంచి రాష్ట్రానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ అంతర్జాతీయ నిందితుడిని నల్లకుంట పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్, ఓజీ గంజాయి సరఫరా కేసులో పది నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. నల్లకుంట ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పార్కు వద్ద డ్రగ్స్, ఓజీ గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. సంఘటన స్థలంలో శ్రీనివాస్ రాహుల్‌కు ఓజీ డ్రగ్ సరఫరా చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో ఏ1 నిందితుడు తమిళనాడుకు చెందిన తంగయ్య చంద్రశేఖరన్ శివకుమార్(32) కాగా, అతను థాయిలాండ్‌లో స్థిరపడ్డాడు. ఈ కేసులో అతడిని పట్టుకోవడానికి నల్లకుంట పోలీసులు గత సంవత్సరం అక్టోబర్‌లో లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. నిందితుడు ఇండియాకు వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. థాయిలాండ్ నుంచి విమానాలు, ఓడల ద్వారా డ్రగ్స్‌ను ఇండియాకు తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
