చేనేత వస్త్రాలకు ఫుల్ క్రేజ్

చేనేత వస్త్రాలకు ఫుల్ క్రేజ్
  • సోషలైట్ పల్లవి ఠాకర్
  • బంజారాహిల్స్​లో జాతీయ చేనేత ప్రదర్శన ప్రారంభం

జూబ్లీహిల్స్, వెలుగు: రోజురోజుకు చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరుగుతోందని, వాటిని కొనుగోలు చేసేందుకు నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారని నగర సోషలైట్ పల్లవి ఠాకర్ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్​12లోని కళింగ కల్చరల్ సెంటర్‌‌‌‌లో జయేష్ గుప్తా ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన–2026ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, చేనేత కారులు తయారు చేసిన వస్త్రాలను పరిశీలించారు. చేనేత కార్మికులు నేసిన చీరలు, దుప్పట్లు, డ్రెస్సులకు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తున్నట్లు పేర్కొన్నారు. చేనేత వస్త్రాలను కొంటే అందమైన దుస్తులు ధరించడమే కాకుండా వేలాది మంది చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పించినట్లవుతుందని ఆమె అన్నారు.

ప్రతి చీర వెనుక ఉన్న కష్టాన్ని గుర్తించి చేనేతకు మద్దతుగా నిలవడం సమాజ బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రదర్శన నిర్వాహకుడు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 12 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కారులు, చేతిపని బృందాలు పాల్గొంటున్నట్లు తెలిపారు. సిల్క్ హ్యాండ్‌‌‌‌లూమ్ చీరలు, డ్రెస్సు మెటీరియల్స్‌‌‌‌తో సహా సుమారు 74 వేల రకాల వస్త్ర ఉత్పత్తులు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని వివరించారు.