శృంగేరి పీఠం ఆధ్వర్యంలో బాసర మాస్టర్ ప్లాన్ ..రాతి శిలలతో నిర్మాణం దీని ప్రత్యేకత

శృంగేరి పీఠం ఆధ్వర్యంలో బాసర మాస్టర్ ప్లాన్ ..రాతి శిలలతో నిర్మాణం దీని ప్రత్యేకత

దక్షిణ భారతంలోనే ఏకైక జ్ఞాన సరస్వతీ క్షేత్రం.. వేల ఏండ్ల నాటి చారిత్రక వైభవం ఉన్న బాసర ఆలయం సరికొత్త శోభను సంతరించుకోబోతోంది. అక్షరాభ్యాసాలకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రాన్ని అత్యంత వైభవంగా, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పునఃనిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.225 కోట్లను కేటాయించగా.. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. వేద వ్యాస మహర్షి స్వయంగా ఇసుకతో ప్రతిష్టించిన ముగ్గురమ్మల (సరస్వతి, లక్ష్మి, కాళీ) ఆలయం, భక్తుల సౌకర్యార్థం సకల హంగులతో రూపుదిద్దుకోనుంది. 

ఆలయ పునర్నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా శృంగేరి పీఠాధిపతుల సంప్రదింపులతో తుది ప్రణాళిక సిద్ధం చేశారు. గర్భాలయం, అర్థ మండపం, గోపురాలు, మాడ వీధుల నిర్మాణానికి వారి అనుమతులు తీసుకున్నారు. ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయ పరిధిని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఆలయానికి ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురాన్ని, మిగిలిన మూడు దిశల్లో 7 అంతస్తుల గోపురాలను నిర్మించనున్నారు. 33 అడుగుల వెడ‌ల్పుతో నాలుగు దిక్కుల మాఢ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించ‌నున్నారు.

మొత్తంగా ఆల‌య విస్తీర్ణాన్ని 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల నుంచి 62 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు పెంచుతున్నారు. నిర్మాణాలన్నీ శిలలతో (రాతితో) జరగడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. 6 వేల మంది ఒకేసారి వేచి ఉండేలా అన్ని వ‌స‌తుల‌తో (ఫీడింగ్ రూమ్‌, ఫుడ్ స్టాల్స్‌, టాయిలెట్స్ త‌దిత‌రాల‌తో) 70 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌తో క్యూ కాంప్లెక్స్‌లు, 200 మంది ఏక‌కాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యంతో వంటశాల‌, భోజ‌న శాల‌లు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు.. తూర్పు దిక్కున ఆధ్యాత్మిక‌త ప‌రిఢ‌విల్లేలా తోర‌ణాలు, స‌మాచార కేంద్రం, దేవాల‌యానికి ఉత్తర‌, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాల‌యం నుంచి ఆవ‌త‌లి వైపు వెళ్లేందుకు అండ‌ర్ పాస్‌, సోలార్ రూప్‌టాప్‌తో వెహికల్స్‌ పార్కింగ్‌, దేవాల‌య ప్రాంగణంలో పుష్పవ‌నం ప‌నులు చేప‌ట్టనున్నారు. ఆల‌య ప్రాంగ‌ణం ఆవ‌ల హెల్త్ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌నున్నారు. భ‌విష్యత్‌లో ఆల‌యం వెనుక భాగం భారీ వృక్షాల‌తో ఆల‌రారేలా మొక్కలు నాట‌నున్నారు.