- మోదీ, అమిత్ షాతో కలిసి ల్యాండ్ ఏటీఎం నడుపుతున్నడు
- ఆయన భారత్‌లోనే అత్యంత అవినీతి సీఎం
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చట్టపరమైన చర్యలు
- అస్సాంలో కాంగ్రెస్ అగ్రనేత ఎన్నికల ప్రచారం
గువాహటి: అస్సాం రాష్ట్రాన్ని సీఎం హిమంత తన స్వంత ఏటీఎంలా మార్చుకున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్ర వనరులను ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆదివారం అస్సాంలోని బిశ్వనాథ్ చరియాలి, గోలాఘాట్‌లో
నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. బీజేపీపై, ముఖ్యంగా సీఎం హిమంత బిశ్వ శర్మపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత్‌లోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంత అని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘ఆయన క్షమాపణలు కోరినా వదిలిపెట్టం.. 10–15 ఏండ్లపాటు జైలుకు పంపుతాం” అని వ్యాఖ్యానించారు. కేవలం సీఎంపైనే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై కూడా విచారణ జరిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ప్రజల్లో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నరు..
హిమంత నేతృత్వంలోని బీజేపీ సర్కారు అస్సాం ప్రజల్లో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. హిమంత బిశ్వ శర్మ అవినీతి చిట్టా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా వద్ద ఉందన్నారు. మోదీ, అమిత్ షా, హిమంత బిశ్వ శర్మ కలిసి అస్సాంలో ‘ల్యాండ్ ఏటీఎం’ నడుపుతున్నారని రాహుల్ విమర్శించారు. సామాన్యుల నుంచి లాక్కున్న సుమారు 98,400 బిఘాల భూమిని ముగ్గురు పెద్ద పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ కార్పొరేట్ సంస్థలే బీజేపీకి నిధులు సమకూర్చే యంత్రాలుగా పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇక్కడి ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి నియంత్రిస్తున్నారని అన్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, అప్పుడు ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు.
మోదీని నియంత్రిస్తున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయని, వాటి ద్వారా ఆయన ప్రధాని మోదీని నియంత్రిస్తున్నారని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ రైతులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని ఆరోపించారు. అమెరికా నుంచి 9 లక్షల కోట్ల విలువైన వస్తువుల కొనుగోలుకు ఒప్పందం చేసుకుని భారత మార్కెట్‌ను ధారాదత్తం చేశారని విమర్శించారు. అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను ఏకం చేయడానికి కృషి చేస్తుందని రాహుల్ తెలిపారు. బీజేపీ విద్వేషాలను పెంచుతుంటే, కాంగ్రెస్ ప్రేమను పంచుతుందని చెప్పారు.
