ODI World Cup 2023: బీసీసీఐ రిగ్గింగ్ చేస్తోంది.. ప్రపంచ కప్ ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోంది: పాక్ మాజీ క్రికెటర్

ODI World Cup 2023: బీసీసీఐ రిగ్గింగ్ చేస్తోంది.. ప్రపంచ కప్ ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోంది: పాక్ మాజీ క్రికెటర్

వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు సాధిస్తున్న విజయాలను పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఓర్వలేకపోతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తమ వక్రబుద్ధిని బయటపెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం భారత బౌలర్లు ప్రత్యేక బంతులతో బౌలింగ్ చేస్తున్నారని ఆరోపించిన మేధావి వర్గం.. ఇప్పుడు మరో కొత్త వాదనతో మీడియా ముందుకు వచ్చారు. 

టాస్ వేసే సమయంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కుట్ర పన్నుతాడని ఆరోపించిన పాక్ మాజీ ఆటగాళ్లు సికందర్ భక్త్, ఆకిబ్ జావేద్.. ఫలితాలను బట్టి చూస్తుంటే ప్రపంచ కప్ ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్లు అనిపిస్తోందని మాట్లాడారు.    

పాకిస్థాన్ కు చెందిన ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సికందర్ భక్త్.. రోహిత్ శర్మపై సంచలన ఆరోపణలు చేశాడు. టాస్ సమయంలో హిట్‌‌మ్యాన్ కుట్ర పన్నుతున్నాడని ఆరోపించాడు. టాస్ వేసే సమయంలో రోహిత్ కాయిన్ ను దూరంగా విసిరేస్తున్నాడని.. దాంతో ఇతర జట్ల కెప్టెన్లకు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని మాట్లాడాడు. ఆ సమయంలో  అక్కడ ఉంటున్న మ్యాచ్ రిఫరీలు(ఐసీసీ అధికారులు) ప్రత్యర్థి జట్టు కెప్టెన్ టెయిల్స్ చెబితే హెడ్స్ అని, హెడ్స్ చెబితే టెయిల్స్ అని చెప్తున్నారని ఆరోపించాడు.

ఇక ఆకిబ్ జావేద్ అయితే.. ప్రత్యర్థి కెప్టెన్ నాణెం వైపు చూడనప్పుడు టాస్ వేయడం ఎందుకు అని మండిపడ్డాడు. బీసీసీఐ క్రికెట్‌ను నియంత్రిస్తున్నా.. చర్యలు తీసుకోవడానికి ఐసీసీ వెనుకాడుతోందని ఆరోపించాడు. "ఈ ప్రపంచకప్ ప్లాన్ చేయబడింది.. భారత జట్టే గెలుస్తుంది. 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లోనూ బీసీసీఐ టాస్ విషయంలో రిగ్గింగ్ చేసింది. అందువల్లే శ్రీలంకపై విజయం సాధించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది.." అని ఈ  మాజీ క్రికెటర్ ఆరోపించాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కాగా, వాంఖడే వేదికగా బుధవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను ఓడించిన  భారత జట్టు  సెమీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది.