అన్నంలో పురుగులు..తాగే నీళ్లలో జెర్రీలు..కిచిడీలో బొద్దింకలు..

అన్నంలో పురుగులు..తాగే నీళ్లలో జెర్రీలు..కిచిడీలో బొద్దింకలు..
  • మహబూబాబాద్ బాలికల ఆశ్రమ స్కూల్‌‌లో ఘటన 
  • అన్నంలో పురుగులు, తాగే నీళ్లలో జెర్రీలు, కిచిడీలో బొద్దింకలు వస్తున్నాయని ఆందోళన 
  • చేర్యాల గురుకుల డిగ్రీ కాలేజీలోనూ ఫుడ్​పాయిజన్​
  • బాసర ట్రిపుల్‌‌ ఐటీ ఫుడ్ పాయిజన్ ఘటనలో మరో స్టూడెంట్‌‌కు సీరియస్‌‌

మహబూబాబాద్​అర్బన్/ చేర్యాల /బాసర / టేకులపల్లి, వెలుగు: మహబూబాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ స్కూల్‌‌లో మధ్యాహ్న భోజనంలో వానపాము రావడం కలకలం రేపింది. ఆ ఫుడ్‌‌ తిని మొత్తం 36 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. అందులో నలుగురి పరిస్థితి సీరియస్‌‌గా ఉంది. స్టూడెంట్స్‌‌​కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 957 మంది స్టూడెంట్స్ ఉన్నారు. గురువారం మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు పప్పు, కూరలో వానపాము వచ్చింది. ఆ ఫుడ్‌‌ తిన్న స్టూడెంట్స్‌‌లో 36 మంది గురువారం సాయంత్రం నుంచి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారిని జిల్లా హాస్పిటల్‌‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో అనిత, అశ్విని, కావేరి, అఖిల పరిస్థితి కొంత సీరియస్‌‌గా ఉంది. వారికి మెరుగైన ట్రీట్‌‌మెంట్ అందిస్తున్నామని, ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పారు. కూరలో వానపాము వచ్చిన విషయాన్ని ఓ స్టూడెంట్​వార్డెన్‌‌కు ఫిర్యాదు చేసినా, అదే తినాలని చెప్పినట్లు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. దీంతో ఏటీడబ్ల్యూవోకు ఫిర్యాదు చేశామని, అయినా పట్టించుకోలేదని వాపోతున్నారు. 

చేర్యాల గురుకుల డిగ్రీ కాలేజీలో ఫుడ్​ పాయిజన్​

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్‌‌లో ఫుడ్ పాయిజన్‌‌తో ముగ్గురు స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి భోజనం అయ్యాక స్టూడెంట్స్‌‌కు విరేచనాలు కావడంతో చేర్యాల ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. శుక్రవారం ఉదయానికి వారంతా కోలుకొని తిరిగి హాస్టల్‌‌కు చేరుకున్నారు. ఈ విషయమై కాలేజీ ప్రిన్సిపల్ సునీతను ప్రశ్నించగా, ఫుడ్ పాయిజన్ జరగలేదని, ఆ ముగ్గురు స్టూడెంట్స్‌‌కు విరేచనాలు కావడంతో హాస్పిటల్‌‌కు తీసుకెళ్లామని చెప్పారు. ఫుడ్ విషయంలో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామని, ఫుడ్‌‌ పాయిజన్‌‌ అయ్యే అవకాశమే లేదన్నారు. 

మరో ట్రిపుల్ ఐటీ స్టూడెంట్‌‌కు సీరియస్​

బాసర ట్రిపుల్‌‌ ఐటీ ఫుడ్ పాయిజన్ ఘటనలో మరో స్టూడెంట్‌‌ పరిస్థితి సీరియస్‌‌గా ఉంది. హనుమకొండకు చెందిన విఘ్నేశ్ బాసరలో పీయూసీ-1 చదువుతున్నాడు. ఈ నెల 15న ఫుడ్ పాయిజన్ కాగా, అక్కడే ట్రీట్‌‌మెంట్ తీసుకున్నాడు. తర్వాత క్యాంపస్‌‌కు సెలవులివ్వడంతో ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి విఘ్నేశ్ అనారోగ్యంతో బాధపడుతుండగా, హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే రూ.30 వేలు ఖర్చు చేశామని పేరెంట్స్​ చెప్తున్నారు. స్టూడెంట్స్‌‌కు హెల్త్ ఇన్సూరెన్స్ పేరిట రూ.700 కట్టించుకున్నారని, ఆ ఇన్సూరెన్స్ ఏ హాస్పిటల్‌‌లో వర్తిస్తుందో ఆఫీసర్లు చెప్పడం లేదని విఘ్నేశ్ తల్లిదండ్రులు​ఆరోపించారు. 

బర్లగూడెంలో 25 మందికి అస్వస్థత 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బర్లగూడెం ప్రైమరీ స్కూల్‌‌లో ఫుడ్ పాయిజన్‌‌తో 25 మంది స్టూడెంట్స్‌‌ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు.​ మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ తమకు ఒళ్లంతా దురదగా ఉందని టీచర్లకు చెప్పారు. కాసేపటికే స్టూడెంట్స్ అందరూ దురదగా ఉందని చెప్పడంతో, ఇంటికి వెళ్లి స్నానం చేసి రావాలని వారికి చెప్పినట్లు టీచర్ వసంతరావు తెలిపారు. ఇద్దరు విద్యార్థులకు విపరీతంగా దురదలు వచ్చి ఒళ్లంతా ఎర్రగా మారడంతో సులానగర్ పీహెచ్‌‌సీకి 
తరలించారు. 

ఆందోళనకు దిగిన స్టూడెంట్స్​

మహబూబాబాద్ కలెక్టర్ క్యాంప్ ఆఫీసు, ఆర్డీవో ఆఫీస్ పక్కనే ఉన్న గురుకులంలో అన్నీ సమస్యలే ఉన్నాయని స్టూడెంట్స్ చెబుతున్నారు. తినే అన్నంలో వానపాములు వచ్చినా అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. వార్డెన్, ఏటీడబ్ల్యూవోలను తొలగించాలని డిమాండ్‌‌ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్, అడిషనల్ కలెక్టర్, సీఐ, జిల్లా గిరిజన శాఖ అధికారులు గురుకులానికి చేరుకున్నారు. అన్నంలో పురుగులు, వానపాములు, తాగు నీటిలో జెర్రీలు, కిచిడిలో బొద్దింకలు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్‌‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే, అధికారులు హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్‌‌​ఆందోళన విరమించారు. అంతకుముందు హాస్పిటల్‌‌లో చికిత్స తీసుకుంటున్న స్టూడెంట్స్‌‌ను పరామర్శించారు.