ఫుడ్ ప్రాసెసింగ్‌‌‌‌ యూనిట్‌‌‌‌కు స్థలం దొరుకుతలే...

ఫుడ్ ప్రాసెసింగ్‌‌‌‌ యూనిట్‌‌‌‌కు స్థలం దొరుకుతలే...
  • రెండు చోట్ల ప్లేస్‌‌‌‌లను గుర్తించిన ఆఫీసర్లు
  • సాగు భూములు తీసుకోవద్దంటూ రైతుల ఆందోళన
  • మడిపెల్లి గ్రామం వద్ద 80 ఎకరాలు సేకరించిన ఆఫీసర్లు
  • మిగతా భూమి కోసం ఆఫీసర్ల వెతుకులాట

మహబూబాబా​ద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌‌‌‌కు స్థలాన్ని గుర్తించడం ఆఫీసర్లకు సవాల్‌‌‌‌గా మారుతోంది. యూనిట్ కోసం మొత్తం 200 ఎకరాలు అవసరం కాగా జిల్లాలో ఎక్కడా తగిన భూమి దొరకడం లేదు. పలు చోట్ల స్థలాలను గుర్తించినప్పటికీ తమ సాగు భూములను ఎలా తీసుకుంటారంటూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో భూ సేకరణపై ఆఫీసర్లు వెనక్కి తగ్గుతున్నారు. 

నాలుగేళ్లుగా పెండింగ్‌‌‌‌లోనే...

మహబూబాబాద్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్ ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు నాలుగేళ్ల కిందే నిర్ణయించారు. కానీ అందుకు తగ్గ స్థలం దొరకకపోవడంతో యూనిట్ ఏర్పాటు పనులు ముందుకు సాగడం లేదు. తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామ శివారులో 80 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ ఆఫీసర్లు సేకరించి టీఎస్‌‌‌‌ఐఐసీకి అప్పగించారు. మిగిలిన భూ సేకరణ పనులు ముందుకు సాగకపోవడంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది.

తొలుత ముడుపుగల్ గ్రామ పరిధిలో...

మహబూబాబాద్ మండల పరిధిలో శనిగపురం, ముడుపుగల్​, అయోధ్య గ్రామాల సమీపంలో సుమారు 150 ఎకరాల అసైన్డ్​ భూమి ఉంది. దీంతో ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు మొదట నిర్ణయించారు. విషయం తెలుసుకున్న మూడు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమకు జీవనాధారమైన భూములను తీసుకుంటే తామంతా ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరించారు. వీరికి ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో పాటు, పలు పార్టీల నేతలు సైతం మద్దతు ప్రకటించారు. దీంతో ఆఫీసర్లు వెనక్కి తగ్గి భూసేకరణను నిలిపివేశారు.

రాజోలు, స్టేషన్ ​గుండ్రాతిమడుగు వద్ద...

కురవి మండల పరిధిలోని రాజోలు, స్టేషన్ ​గుండ్రాతిమడుగు గ్రామాల పరిధిలోని ​152 సర్వే నంబర్ లో 250 ఎకరాల అసైన్డ్ భూమిని గుర్తించారు. ఇక్కడైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని భావించిన ఆఫీసర్లకు రైతుల నుంచి వ్యతిరేకత తప్పలేదు. తమకు నష్టం చేయొద్దంటూ ఆందోళనకు దిగడంతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్​, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే డీఎస్​ రెడ్యానాయక్​లకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ కూడా భూసేకరణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.

80 ఎకరాలు మాత్రమే అప్పగించారు

మహబూబాబాద్​ జిల్లాలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని చెప్పడం తో సుమారు 200 ఎకరాల్లో ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్స్​ ఏర్పాటు చేయా లని భావించాం. రెవెన్యూ ఆఫీసర్లు ఇప్పటి వరకు 80 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే అప్పగించారు. భూమి వివరాలను హెడ్ ఆఫీస్ కు పంపించాం. ఇప్పటివరకు ఏ కంపెనీకి భూమి కేటా యించలేదు. ప్రక్రియ ప్రాసెస్​లో ఉంది.
-సత్యనారాయణ, టీఎస్ఐఐసీ, జిల్లా ఇన్ చార్జి మేనేజర్