సంగారెడ్డి టౌన్, వెలుగు: ఫతే ఖాన్ దర్గా ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డిలో వక్ఫ్‌బోర్డ్, మున్సిపల్, విద్యుత్ అధికారులు, మైనార్టీ నాయకులతో కలిసి జనవరి 9 నుంచి 11 వరకు జరిగే ఉర్సు ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు.
దర్గా పరిసర ప్రాంతాలతోపాటు శివాజీ నగర్ పాత బస్టాండ్ వివిధ మార్గాలను కలుపుతూ లైటింగ్ఏర్పాటు చేయాలని చెప్పారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ ఎమ్మెల్యేకు, టీఎస్ఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డికి అధికారికంగా ఆహ్వాన పత్రిక అందించాలని సూచించారు.
సంగారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు దర్గాతోపాటు సీఎస్ఐ చర్చి, వైకుంఠపురం, జ్యోతిర్వాస విద్యాపీఠంకు నిధులు కేటాయించేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఫతేఖాన్ దర్గా, సదాశివపేట మెహబూబ్ బాషా దర్గా కమిటీలను త్వరలో నియమించమని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
