ప్రధాని ఫొటో కోసమే ఆసుపత్రికి మరమ్మతులు : ప్రతిపక్షాలు

ప్రధాని ఫొటో కోసమే ఆసుపత్రికి మరమ్మతులు : ప్రతిపక్షాలు

దాదాపు 141మంది మృత్యువాత పడిన భారీ వంతెన ఘటన దేశాన్ని కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారికి గుజరాత్ మోర్భీలోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఆసుపత్రికి సడెన్ గా రంగులద్దే ప్రక్రియను యాజమాన్యం చేపట్టింది. దానికి కారణమేంటంటే నేడు ప్రధాని మోడీ బాధితులను పరామర్శించేందుకు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆసుపత్రిని అలంకరిస్తున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పాత గోడలతో దర్శనమిస్తోన్న ఆసుపత్రిలోని పలు విభాగాలను పెయింట్ వేసి కొత్తగా కనిపించేలా చేస్తున్నారన్నారు. దాంతో పాటు ఆసుపత్రిలో కొన్ని చోట్ల కొత్త వాటర్ కూలర్లు, వార్డులలోని పేషంట్లకు బెడ్ షీట్లు అందిస్తున్నారని చెప్పారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంగణాన్ని ఊడ్చి.. క్లీన్ చేయిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

ప్రధానికి ఫొటోషూట్ నిర్వహించేందుకు బీజేపీ ఈవెంట్ మేనేజ్ మెంట్ లో బిజీగా ఉందని ఆప్, కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తున్నాయి. అక్కడ అంతమంది చనిపోయి, గాయాలై ఉంటే.. వీరు మాత్రం బీజేపీ హయాంలో అంతా బాగుందని చెప్పుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ఇవన్నీ ప్రధాని ఫొటోలు బాగా రావాలనే చేస్తున్నారని మండిపడ్డారు. గత 27ఏళ్లలో బీజేపీ ఈ పని చేసి ఉంటే.. ఆసుపత్రిని ఇప్పుడిలా అలంకరించాల్సిన అవసరం లేకపోయేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.